Saturday, November 23, 2024

రేపటినుంచి శ్రీశైలంలో ఆన్‌లైన్‌లోనే అన్ని రకాల సేవా టికెట్ల బుకింగ్

శ్రీశైలం శ్రీ భమరాంబికా మల్లిఖార్జున స్వామి దేవాలయంలో రేప‌టినుంచి (సోమవారం) అన్ని రకాల ఆర్జిత సేవలు, శ్రీ స్వామి వార్ల స్పర్శ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెంట్ బుకింగ్ ద్వారా ఆర్జిత సేవలు, శ్రీ స్వామి వారి స్పర్శ దర్శనం టికెట్లు ఇవ్వడం లేదని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, శ్రీ స్వామి వార్ల స్పర్శ దర్శనం టికెట్లను ఏప్రిల్ 25వ తేదీనే ఆన్ లైన్‌లో అందుబాటులో ఉన్న‌ట్టు చెప్పారు. ఆర్జిత సేవ, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారు విధిగా ఆన్ లైన్ లో పొందిన టికెట్ ప్రింట్ కాపీ వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా పొందిన ఆ టికెట్లు స్కాన్ చేశాక మాత్రమే ఆర్జిత సేవ, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తామని ఈవో లవన్న తెలిపారు. ఆర్జిత సేవకర్తలు, స్పర్శ దర్శనం టికెట్లు గల వారు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు (ఒరిజినల్ లేదా జిరాక్స్) వెంట తెచ్చుకోవాలి. ఆధార్ కార్డును అనుసరించే ఆర్జిత సేవాకర్తలు, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారిని అనుమతిస్తారు.

ఇప్పటికే భక్తులు.. దేవస్థానం వెబ్‌సైట్ www.srisailadevasthanam.org ద్వారా ముందస్తుగా టికెట్లు పొందారు. అయితే, రూ.150 రుసుముతో శీఘ్ర దర్శనం, రూ.300లతో అతి శీఘ్ర దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌తోపాటు కరెంట్ బుకింగ్ ద్వారా పొందొచ్చు. ఈ టికెట్లలో 30 శాతం ఆన్ లైన్ బుక్ చేసుకునే అవకాశం కల్పించగా, మిగతా 70 శాతం టికెట్లు కరంట్ బుకింగ్ ద్వారా జారీ చేస్తారు. ఇక వారంలో నాలుగు రోజులు.. మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచితంగా శ్రీ స్వామి వారి స్పర్శ దర్శనం యధావిధిగా కొనసాగుతుంది.

ఇక సర్ప దోష నివారణ పూజ, అక్షరాభ్యాసం, అన్న ప్రాశన టికెట్లు కరంట్ బుకింగ్ ద్వారా కూడా ఇస్తారు. సామాన్య భక్తులకు సర్వ దర్శనానికి ఇబ్బందులు లేకుండా అన్ని ఆర్జిత సేవలు విడతల వారీగా నిర్వహిస్తారు. శ్రీ స్వామి వారి స్పర్శ దర్శనం కూడా నిర్దిష్ట వేళలోనే అనుమతి ఇస్తారు. కనుక ఆన్ లైన్ ద్వారా టికెట్లు పొందిన ఆర్జిత సేవాకర్తలు.. టికెట్లపై సూచించిన సమయంలో మాత్రమే ఆయా ఆర్జిత సేవలు జరిపిస్తారు. సేవాకర్తలు వారి టికెట్లపై సూచించిన సమయం కంటే కనీసం 15 నిమిషాలు ముందు ఆర్జిత సేవా క్యూ లైన్ ప్రవేశ ద్వారం వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే, స్పర్శ దర్శనం టికెట్ పొందిన భక్తులకు కూడా టికెట్ మీద పేర్కొన్న సమయంలో మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తారు.

ప్రొటోకాల్ దర్శనంలో మార్పులు

- Advertisement -

శ్రీశైల శ్రీ భమరాంబికా శ్రీ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే ప్రముఖులు కనీసం రెండు రోజుల ముందు వారి పర్యటన వివరాలు తెలియజేయాలని ఈవో లవన్న తెలిపారు. అలాగే వసతి ఏర్పాట్లకు సంబంధించిన సిఫారసు విషయమై ప్రముఖులంతా తమ లెటర్ హెడ్ పై కనీసం రెండు రోజుల ముందు సమాచారం అందజేయాల్సి ఉంటుంది. ఈ లేఖలను [email protected] మెయిల్ ఐడీకి పంపాలి. అలాగే ప్రొటోకాల్ ఫోన్ నంబర్ 9160016215 కు కూడా వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

ప్రస్తుతం ప్రభుత్వ సెలవు దినాలు, పర్వదినాల్లోనే కాకుండా భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తున్నారు. అందుకే భక్తులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా సౌకర్యవంతంగా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు, ఆర్జిత సేవలు జరిపించుకునేందుకు ఈ మార్పులు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు. కనుక భక్తులంతా దేవస్థానం అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement