అమరావతి, ఆంధ్రప్రభ ఉల్లిగడ్డను కోస్తే కన్నీళ్లు వస్తాయని అంటారు గానీ.. ఇప్పుడు పెరుగుతున్న ఉల్లి ధరలు చూస్తున్నా కన్నీళ్లే వస్తున్నాయి. ఉల్లిధర పెరిగితే మన వంటింటి బడ్జెట్ పెరగడం ఖాయం. మధ్య తరగతి ప్రజలకు ఇప్పుడు ఇదే ఆందోళన కలిగిస్తోంది. సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే వంటింటి సామాను ధరలు అంచనాలకు మించి పెరుగుతున్నాయి. కొన్ని నెలల కిందట పెరిగిన ఉల్లి తర్వాత తగ్గినప్పటికీ మళ్లీ కన్నీరు పెట్టించేందుకు సిద్ధమౌతోంది.
ఏ కూర వండాలన్నా ఉల్లి తప్పనిసరి. ప్రతి ఇంటిలోని వంటగదిలో ఉల్లిగడ్డ లేనిదే ఏ వంటకం పూర్తి కాదు. ఉల్లిగడ్డ వేస్తే అదో రుచీ. ఉల్లిగడ్డ వేయకుండా వంట చేస్తే కొందరికి ముద్ద దిగదు. అంతలా వంటింట్లో పెనవేసుకుపోయింది. ఇక పానీపూరీ బండి దగ్గరికి వెళ్తే.. దాదాపుగా ప్రతీ ఒక్కరు అనే మాట.. ‘భయ్యా తోడా ప్యాస్ దాలో’. అంతలా మన జీవితంలో ఉల్లిగడ్డ పెనవేసుకుపోయింది.
పెరుగుతున్న ఉల్లిగడ్డ ధరలు..
ఉల్లి ధరలు మరోసారి పెరుగుతున్నాయి. ఈ నెల 25 నాటికి ఉల్లిగడ్డ గరిష్ట చిల్లర ధర కిలోకు రూ.70 వరకు పలుకుతోంది. డిసెంబర్ వరకు ఖరీఫ్ పంట మార్కెట్‌లోకి వచ్చే అవకాశం లేదు. దీంతో అప్పటి వరకు ఉల్లిగడ్డ ధర పెరుగుతూనే ఉంటుందని అంటున్నారు. హోల్‌సేల్‌లో ఈ నెల 1న క్వింటా ఉల్లికి రూ.2,506 పలకగా, 26 నాటికి 3,112కి చేరిందని వినియోగదారుల వ్యవహారాల శాఖ డేటా వెల్లడించింది.
ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం..
డిమాండ్ పెరగడం, ఉత్పత్తి ఆలస్యం కావడంతో ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆగస్టులోనే 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. డిసెంబర్ వరకు ఇదే సుంకం ఉంటు-ందని తెలిపింది. అయినప్పటికీ ధరల పెరుగుతుండడం జనాలను కలవరపాటుకు గురి చేస్తోంది. ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా సేకరించిన ఉల్లిపాయలను హోల్‌సేల్ మార్కెట్‌లలో తక్కువ ధరలకు విక్రయించడం కూడా ప్రారంభించింది.
అయితే.. పండుగ సీజన్‌లో ఉల్లికి డిమాండ్ పెరగడం, నిల్వలు తగ్గిపోవడంతో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల పాటు ఉల్లి ధర పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గత రెండేళ్లుగా రైతులు నష్టపోవడంతో ఉల్లిసాగు సాగును తగ్గించారని, ఇదీ కూడా ధరల పెరుగుదలకు ఓ కారణంగా కనిపిస్తోంది. పెరుగుతున్న ధరతో ఉల్లిపాయలను వినియోగించే లక్షలాది కుటుంబాలపై అదనపు భారం పడవచ్చు. మార్కెట్‌లో ఉల్లి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
ఉల్లి బస్తా ధర రూ.1,600 నుంచి 2,000 రూపాయల వరకు హోల్ సేల్ మార్కెట్లో పలుకుతోంది. అయితే ఇది ఉల్లి పండించిన రైతులకు కొంత సానుకూలంగా ఉంది. అయితే వాతావరణ ప్రతికూలతల వల్ల ఈ ఏడాది ఉల్లి ఎక్కువగా పండింటే కర్ణాటక జిల్లాల్లో పంట నష్టం ఏర్పడింది. దీంతో ధర ఉన్నప్పటికీ రైతుల వద్ద అమ్మేందుకు పంట లేని పరిస్థితి నెలకొందని వెల్లడైంది. వర్షాకాలంలో కర్ణాటకలోని రైతులు ఉల్లిని అధికంగా పండిస్తుంటారు.
అయితే గడచిన నాలుగేళ్లుగా సకాలంలో వర్షాలు పడకపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి తోడు ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించటంతో క్షేత్రస్థాయిలో రైతులు ఉల్లి సాగుపై పెద్దగా ఆసక్తి చూపటం లేదని వెల్లడైంది. పైగా వర్షాభావ పరిస్థితుల కారణంగా వేల హెక్టార్లలో వేసిన ఉల్లి సాగు నేలకొరిగిందని రైతులు వాపోతున్నారు. అలా గడచిన నాలుగేళ్లుగా రైతులు నష్టాలనే చూస్తున్నారని వెల్లడైంది.
ఇదే సమయంలో దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆహార ధరలు నియంత్రణలో ఉండాలని మోదీ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఉల్లి ధర కేజీకి రూ.50కి మించకుండా ఉండాలని కోరుకుంటోంది. ఈ సారి ఖరీఫ్ పంట ఆలస్యంగా చేతికి రావటంతో పాటు- పంట దిగుబడి తగ్గడంతో ప్రస్తుత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉల్లిపాయల పెరుగుతున్న ధరలను అరికట్టడానికి కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.