ఒంగోలు, ప్రభన్యూస్ : విద్యుత్ కోతలతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఎండుతున్న పంటలను కాపాడుకోడానికి తిప్పలు పడుతున్నారు. విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరుగుతుండటంతో పలు సందర్భాల్లో విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. తద్వారా వ్యవసాయానికీ విద్యుత్ కోతలు తప్పట్లేదు. విద్యుత్ కోసం ఇప్పటికే రైతులు రోడ్డెక్కుతున్నారు. కొద్ది రోజుల క్రితం విద్యుత్ సరఫరాకు ఢోకా లేని స్థితి నుంచి ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు పొలాల దగ్గరే పడిగాపులు పడుతున్నారు. ఒకే బోరు కింద ఉన్న పొలంలో సగం తడిస్తే.. మిగిలిన సగానికి నీరందక పంట వాడుతోంది. మరి కొద్ది రోజులు ఇలాగే ఉంటే పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల విద్యుత్‌శాఖ కార్యాలయాల ముట్టడి.. రోడ్ల పై నిరసనలు చేస్తున్నారు. వ్యవసాయ సర్వీసులకూ గంట నుంచి రెండు గంటల పాటు అనధికార కోతలు అమలు చేస్తున్నారు. వ్యవసాయ అవసరాలకు పగటి పూట 9గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటనలు క్షేత్ర స్థాయిలో అమలు కావటం లేదు.
నాగార్జున సాగర్ కుడి కాలువ పరిధిలోని అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో వ్యవసాయ బోర్ల కింద మిర్చి, మొక్కజొన్న,పొగాకు పంటలు సాగులో ఉన్నాయి. సుమారుగా 12వేల ఎకరాల్లో బోర్ల ఆధారంగా పంటలు సాగవుతున్నాయి. చీరాల, వేటపాలెం, చినగంజాం తదితర మండలాల్లో వేసవి శనగ సాగవుతోంది. ఇక దర్శి నియోజకవర్గంలో బోర్ల కింద మిర్చి, వరి, పత్తి, బొప్పాలి పంటలు సాగు చేశారు. గిద్దలూరు ప్రాంతంలో పప్పుశనగ, కూరగాయలు సాగువుతున్నాయి. ఈ పంటల సాగుకు నీటిని అందించాలంటే ఖచ్చితంగా విద్యుత్ ఉండాల్సిందే! అయితే ఈ నెల మొదటి వారం నుంచే విద్యుత్ కోతలు అమలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళనలు చెందుతున్నారు. వ్యసాయ సర్వీసులకు గంట నుంచి రెండు గంటల పాటు అనధికార కోతలు అమలు చేస్తున్నారు. వ్యవసాయ అవసరాలకు పగటి పూట 9గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నా.. ఎక్కడా అమలు కావడం లేదు. కేవలం 3 నుంచి 5గంటలు మాత్రమే రైతాంగానికి విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఆ ఇచ్చే విద్యుత్‌లో కూడా మధ్య మధ్యలో కోతలు విధించడం వల్ల మొటార్లు కాలిపోవడం, పంట తడిచిన చోట నుంచే తిరిగి తడుపుకునే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తూ నాణ్యమైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంట చేతికి రాదేమోనన్న ఆందోళన రైతాంగంలో ఉంది.
స్పందించని అధికారులు..
అనధికార విద్యుత్ కోతల పై అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. కోతల పై సమాచారం తెలుసుకునేందుకు ఏ అధికారికి ఫోన్ చేసినా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. విద్యుత్ సమస్యల పై కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినా, అది ఏనాడూ పని చేసిన దాఖలాలు లేవు. విద్యుత్ కోతల పై ముందస్తు సమాచారం కూడా ఇవ్వకపోవడం దారుణమని ప్రజలు పేర్కొంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..