Monday, November 18, 2024

TS | కొనసాగుతున్న డెంగీ ఉధృతి.. ఆసుపత్రుల్లో పెద్ద సంఖ్యలో బాధితులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో చాపకింద నీరుగా డెంగ్యూ జ్వరం విస్తరిస్తోంది. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యంమెరుగ్గా ఉండకపోవడం, నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రజలు నిర్లక్ష్యం చేస్తుండడంతో రాష్ట్రంలో దోమల బెడద పెరిగిపోతోంది. దోమకాటుతో మలేరియాతోపాటు డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవలి కొద్ది రోజులుగా రాష్ట్రంలో డెంగీ కేసుల ఉధృతి కొనసాగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, కంటి వెనక భాగంలో నొప్పి, కాళ్లు, చేతుల్లో వాపు, వాంతులు, దురద డెంగీ లక్షణాలు.

కానీ ఇప్పుడు ఈ లక్షణాలు పెద్దగా బహిర్గతం కాకుండానే వ్యాధి తీవ్రస్థాయికి చేరి ప్రాణాంతకంగా మారుతోంది. డెంగీ లక్షణాలతో ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులకు జనం క్యూ కడుతున్నారు. సమీపంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో వైద్యానికి జ్వరం లొంగకపోతుండడంతో సుదూరంలోని గాంధీ, ఎంజీఎం తదితర ఆసుపత్రులకు పేదలు వెళుతున్నారు. చాలా మంది మధ్య తరగతి ప్రజలు ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నా ప్రాణాలు నిలుస్తాయో లేదోనన్న ఆందోళనలో కూరుకుపోతున్నారు.

- Advertisement -

అనారోగ్యం తీవ్రమయ్యాక ఆసుపత్రులకు చేరుతున్న బాధితులకు వైద్య పరీక్షల్లో డెంగీ నిర్ధారణ అవుతోంది. ఆ పరిస్థితుల్లో తీవ్ర అనారోగ్యంతోపాటు వైద్యానికి కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. డెంగీ ప్రారంభ దశలో జ్వరం తీవ్రత తక్కువగా ఉండడం, స్వల్పంగా జలుబు, ఒళ్లు నొప్పులు ఉంటుండడంతో జనం సాధారణ అనారోగ్యంగా భావిస్తూ సమీపంలోని మందుల దుకాణాల్లో ఔషధాలు తెచ్చుకుని వినియోగిస్తున్నారు.

మరికొందరు ఆర్‌ఎంపీలను ఆశ్రయించి ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోయిన తర్వాత ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నారు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతోందని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో డెంగీ కేసులు సెప్టెంబరు నెలలో తారస్థాయికి చేరుకున్నాయి. అక్టోబరు నెలలోనూ కేసుల్లో పెరుగదల కనిపిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో డెంగీ కేసుల సంఖ్య అధికారికంగానే 7వేలకు సమీపంలో ఉంది.

ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య అంతకు మూడింతలు ఉంటుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే నమోదయ్యాయి. గ్రేటర్‌ తర్వాత మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిధిలో భారీగా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ, మణుగూరు, కొత్తగూడెం పట్టణం, మహబూబాబాద్‌ జిల్లా ముల్కనూరు పీహెచ్‌సీ పరిధి, ఆదిలాబాద్‌ జిల్లా అంకోలి పీహెచ్‌సీ పరిధిలో రెండు నెలలుగా డెంగీ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది.

జగిత్యాల గ్రామీణ జిల్లా పరిధిలోని ప్రాంతాల్లోనూడెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాతోపాటు మంచిర్యాల జిల్లాలో, అదేవిధంగా కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనివైద్యులు సూచిస్తున్నారు. జ్వర లక్షణాలు బయటపడిన వెంటనే అప్రమత్తం కావాలని, వేగంగా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని మెరుగైన వైద్యం తీసుకోవాలని చెబుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైన మందులు అందుబాటు-లో ఉన్నాయని వౖైెద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement