తిరుపతి సిటీ మే 5 (ప్రభ న్యూస్) : ఘనంగా మహా అద్భుతంగా శ్రీ తాతయ్య గుంట గంగమ్మకు మహా కుంభాభిషేకంలో భాగంగా 5వ రోజు అమ్మవారి విగ్రహ పున: ప్రతిష్ట, కలశ ప్రతిష్ట నిర్వహించి సర్వ దర్శన భాగ్యాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజేయేంద్ర సరస్వతి స్వామి భక్తులకు కల్పించారు. శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి విగ్రహ పున: ప్రతిష్ట మహా కుంభాబిషేకం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయం చేరుకున్న కంచి కామకోటి పీఠాధిపతి విజేయేంద్ర సరస్వతి స్వామికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె రోజా, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆలయ మర్యాదలతో సాంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు. పీఠాధిపతి ముందుగా యజ్ఞ శాలలో నిర్వహించే హోమం కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మించిన గర్భాలయంలో గంగమ్మ తల్లి విగ్రహ పున: ప్రతిష్ట చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భాలయం శిఖర కలశ ప్రతిష్ట మహా కుంభ సమర్పణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి భక్తులనుద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ఆలయాలు పున:నిర్మాణాలు చేపట్టి కుంభాభిషేకాలు నిర్వహించాలని అప్పుడే గ్రామం, జిల్లా, రాష్టం, దేశం సుభిక్షంగా ఉంటుందని చూచించారు.
గంగ పురస్కారాలు సందర్భంగా తిరుపతిలో గంగమ్మ తల్లికి మహా కుంభాభిషేకం నిర్వహించడం శుభ సూచకమని తెలిపారు. ప్రతి ఒక్కరు నిత్యం భవంతుని జపిస్తూ ఉండాలని, అందరూ మంచి సంకల్పం కలిగి ఉండాలి అది మీకు సమాజానికి మంచిగా ఉపయోగపడుతుందన్నారు. కుంభాభిషేకం ముఖ్య ఉద్దేశం గురించి 18వ శతాబ్దంలో కంచి కామాక్షమ్మ ఆలయంలో తెలుగులో ఇలా రాసి ఉంది “కుంబాభిషేకం చేసిన సకల జనులు సంతోషించెదరు అని రాసి ఉంది.. తిరుపతిలో గంగమ్మకు కుంభాభిషేకం చేశారు. తిరుపతి ప్రజలందరూ సంతోషంగా వున్నారు. దేశంలో ఉండే తీర్థా క్షేత్రాలను మంచిగా శుభ్రంగా, అందంగా ఉండడానికి సకల జనులు సహకరించాలన్నారు. గ్రామాలలో ఉన్న ఆలయాలలో ధూప దీప నైవేద్యాలు, కుంభాభిషేకాలు, హోమాలు చేయడం వల్ల పుష్కలంగా వర్షాలు కురుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, ఉప మేయర్ భూమన అభినయ రెడ్డి, ఆలయ ఈవో ముని కృష్ణయ్య, ఆలయ ఛైర్మన్ కట్టా గోపి యాదవ్, ధర్మకర్తల మండలి టి.వెంకటేశ్వర రావు, ఎం.హరినాథ్ రెడ్డి, టీ.రమణమ్మ, పి.ధన శేఖర్, వీ.కృష్ణమ్మ, వీ.గీత, ఎన్.భారతి , స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు.