Monday, November 18, 2024

Delhi | ఒక నౌక.. ఇద్దరు కెప్టెన్లు.. కర్ణాటక కాంగ్రెస్‌లో సీన్లు.. ఎన్నికల వేళ ఐక్యత

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న సమయంలో ఏ పార్టీ గెలుస్తుందన్న అంచనాలు, సర్వేలు, ఊహాగానాలు, బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. చాలా సర్వేలు కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అంచనా వేస్తున్నాయి. మొత్తం 224 మంది ఎమ్మెల్యేలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13 నాటికి ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. అధికారం పీఠం ఎక్కాలంటే ఏ పార్టీ అయినా 113 సీట్ల మ్యాజిక్ మార్క్‌ను దాటాల్సిందే. ఈ స్థితిలో సగటున అనేక సర్వేలు కాంగ్రెస్‌కు 106-116 సీట్లు రావొచ్చని, బీజేపీ 79-89 సీట్లతో సరిపుచ్చుకోవాల్సి ఉంటుందని, జేడీ(ఎస్) 24-34 సీట్లు సాధించవచ్చని చెబుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీకి అటూఇటుగా కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలుపొందే అవకాశాలున్నాయని, హీనపక్షంలో ఎక్కువ సీట్లు సాధించే పార్టీగానైనా కాంగ్రెస్ నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ అవి తలకిందులైన పరిస్థితి కూడా ఉంది. కర్ణాటకలోనూ అదే జరుగుతుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ లేనప్పటికీ.. ఎదుటి పార్టీ నుంచి ఎమ్మెల్యేలకు గురిపెట్టి, బీజేపీలో చేర్చుకుని మరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కమలనాథులు ఈసారి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సాధిస్తామని చెబుతున్నారు. రెండు ప్రధాన పార్టీల ధీమా ఎలా ఉన్నా.. తమకు పట్టున్న ప్రాంతంలో తాము గెలుపొందేవి కొన్ని సీట్లే అయినప్పటికీ ఈ రెండు పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రానిపక్షంలో తాము కీలక పాత్ర పోషించవచ్చని జేడీ(ఎస్) భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తక్కువ సీట్లతో జేడీ(ఎస్) నేత కుమారస్వామి ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఈసారి కూడా అదే జరుగుతుందన్న ఆశాభావంతో ఉన్నారు.

మూడు పార్టీలు ఎవరికి వారు తమ బలాబలాలను లెక్కించుకుంటూ అంచనాలు వేసుకుంటుంటే.. కాంగ్రెస్‌లో పరిస్థితి “ఒక నౌక – ఇద్దరు కెప్టెన్లు” అన్నట్టుగా తయారైంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్నప్పటికీ ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం లేదు. సీఎం రేసులో ప్రధాన పోటీదారులుగా మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్ ఉన్నారు. ఇద్దరి మధ్య ఉన్న విబేధాలు, స్పర్థలను పక్కనపెట్టి ఎన్నికల్లో ఐకమత్యంగా కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆ ప్రభావం ఎంతమేర ఉంటుందన్నది సందేహాస్పదమే. ఈ ఇద్దరు నేతల బలాలు, బలహీనతలను ఓసారి పరిశీలిస్తే…

- Advertisement -

క్లీన్ ఇమేజ్‌తో సిద్ధరామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రిగా 2013 నుంచి 2018 వరకు పనిచేసిన సిద్ధరామయ్య వయస్సు ప్రస్తుతం 75 ఏళ్లు. గత నాలుగు దశాబ్దాల్లో ఐదేళ్ల పూర్తి పదవీకాలం ముఖ్యమంత్రిగా కొనసాగి రికార్డు నెలకొల్పారు. జనతాదళ్ (సెక్యులర్) వ్యవస్థాపకుల్లో దేవెగౌడతో పాటు సరిసమానంగా ఉన్న సిద్ధరామయ్య ఆ తర్వాత దేవెగౌడతో విబేధించారు. పార్టీలో దేవెగౌడ కుటుంబ ప్రమేయం, పాత్ర పెరిగిపోవడం ఆయనకు నచ్చలేదు. ఎనిమిది పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన సుదీర్ఘ రాజకీయానుభవంతో పాటు ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఎలాంటి అవినీతి మరకలు లేవు. పైగా 2010లో బళ్లారి ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను అరికట్టలేకపోతున్న భారతీయ జనతా పార్టీ పాలనను వ్యతిరేకిస్తూ బెంగళూరు నుంచి బళ్లారి వరకు పాదయాత్ర కూడా చేశారు. సిద్ధరామయ్యకు క్లీన్ ఇమేజ్‌తో పాటు మాస్ నేతగా కూడా పేరుంది. బడుగు, బలహీన, దళిత, బహుజన వర్గాల్లో సిద్ధరామయ్యకు గట్టి పట్టుంది. ఇవన్నీ ఆయనకు కలిసొచ్చే అంశాలు.  

ట్రబుల్‌షూటర్‌గా డీకే శివకుమార్

బెంగుళూరు రూరల్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకుంటూ ఎదిగిన డీకే శివకుమార్ వయస్సు 61 సంవత్సరాలు. ఆయనకు డైనమిక్, సమర్ధవంతమైన నేతగా పార్టీలో పేరుంది. పార్టీ క్లిష్ట సమయంలో ఉన్న అనేక సందర్భాల్లో ట్రబుల్ షూటర్‌గా పనిచేసి పార్టీని గట్టెక్కించిన ఖ్యాతిని పొందారు. కనక్‌పురా నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఉన్న ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశారు. మంత్రిగా పనిచేసిన సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడి.. తద్వారా వచ్చిన సొమ్మును పార్టీ కోసం క్లిష్ట సమయాల్లో ఖర్చు చేసిన డీకే శివకుమార్ ప్రస్తుతం సీబీఐ, ఈడీ కేసులను కూడా ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ ఆయనకు ప్రతికూలంగా కనిపిస్తున్న అంశాలు.

పార్టీ నేతల మాటేంటి?

ఒకవేళ సర్వే ఫలితాలను నిజం చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఈ ఇద్దరు నేతలు అత్యున్నత పదవి కోసం తలపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదే విషయంపై పార్టీ నేతలను ప్రశ్నించినప్పుడు భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. “ప్రతి వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని ఆశించే పార్టీ మాది. ఇందులో ఎలాంటి నష్టం లేదు. డీకే శివకుమార్ ఆశావాది. అలాగే సీఎం పదవిని ఆశిస్తున్నారు. నేను కూడా ఆశావాహుణ్ణే. ఇందులో ఎలాంటి నష్టం లేదు” అంటూ సిద్ధరామయ్య కన్నడ టీవీలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తెలిపారు. సీఎం పదవిపై డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు మరోలా ఉన్నాయి. “వొక్కలిగ సామాజికవర్గం నుంచి ఎస్ఎం కృష్ణ తర్వాత, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ ఎవరూ పనిచేయలేదు. వొక్కలిగ నేతను ముఖ్యమంత్రిని చేయడానికి ఇదొక మంచి అవకాశం” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ఇద్దరు నేతల ప్రకటనలను బట్టి చూస్తే, కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిన ఇల్లు అనే అభిప్రాయాన్ని కలుగజేస్తోంది. అయితే ఎన్నికల వేళ ఇద్దరూ స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తున్నారు. ఐకమత్యానికి భంగం కలుగకుండానే చూసుకుంటున్నారు. “అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే ఇద్దరు పెద్ద నాయకులు కలిసికట్టుగా, ఒక జట్టులా పని చేయాలని పార్టీలోని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారు. అదే జరుగుతోంది, అదే జరగాలి” అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గతేడాది వ్యాఖ్యానించారు.

కర్ణాటక పీసీసీ ప్రధాన కార్యదర్శి మరియు అధికార ప్రతినిధి నిజాం ఫౌజ్దార్ మాట్లాడుతూ.. ఇద్దరు ముఖ్యనేతల మధ్య విబేధాలు అన్నవి కేవలం మీడియా సృష్టి మాత్రమేనని, అసలు స్పర్థలు, విబేధాలకు తావులేకుండా ఇద్దరూ కలసి పనిచేస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలతోనే వారిద్దరి ఐక్యత, దేశ రాజకీయాలపై చూపబోయే ప్రభావం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరు నేతలతో పాటు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న మరికొందరు నేతలు కూడా పార్టీలో ఉన్నారు. “నాతో సహా సీఎం పదవికి చాలా మంది సమర్థులైన పోటీదారులున్నారు.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, సిద్ధరామయ్యలు రాష్ట్రంలో మా పార్టీకి పెద్దన్నలు. అలాగే డీకే శివకుమార్, దినేష్ గుండూరావు, కృష్ణ బైరేగౌడలు రాష్ట్రంలో తర్వాతి వరుస నాయకులు” అంటూ కర్ణాటక మాజీ హోంమంత్రి ఎంబీ పాటిల్ వ్యాఖ్యానించారు. పార్టీ గెలవకముందే సీఎం కుర్చీపై నేతలు కన్నేసి కూర్చున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వీరి ఆశలను సజీవంగా ఉంచుతాయా లేక నీళ్లు జల్లుతాయా అన్నది మరికొన్నాళ్లలో తేలిపోనుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement