Thursday, September 12, 2024

One Rank One Pension – కేంద్రానికి సుప్రీం కోర్టు జ‌రిమానా వాత

ఆంధ్రప్ర‌భ స్మార్ట్ – న్యూఢిల్లీ – భారత సైన్యంలో రిటైర్డ్‌ రెగ్యులర్‌ కెప్టెన్లకు చెల్లించే పెన్షన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోకపోవడంపై భారత సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌’ పథకం ప్రకారం పింఛను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ ప్రక్రియలో ఏళ్లతరబడి జాప్యం చేస్తోందని మండిపడింది. ఈ క్రమంలో కేంద్రానికి రూ.2 లక్షల జరిమానా విధించింది. ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం.. నవంబర్‌ 14లోగా సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. లేదంటే పెన్షన్‌ పెంపుపై తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది.

పదవీవిరమణ పొందిన అధికారుల పింఛనుకు సంబంధించి నెలకొన్న సమస్యలపై దాఖలైన పిటిషన్లను జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం నేడు విచారించింది. ఈ క్రమంలో ఏళ్లతరబడి ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ”ఎన్నాళ్లు ఇది కొనసాగుతుంది? 2021 నుంచి ఈ వ్యవహారంపై చర్చ జరుగుతోంది. అయినా నిర్ణయం తీసుకోలేదు’ అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. నవంబర్‌ 14లోగా తుది నిర్ణయం తీసుకోకుంటే రిటైర్డ్‌ రెగ్యులర్‌ కెప్టెన్లకు 10శాతం పెన్షన్‌ పెంచేలా తామే ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది.

- Advertisement -

కేంద్రం తరఫున హాజరైన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భట్టీ వాదిస్తూ.. ”క్షమాపణలు మాత్రమే చెప్పగలను. మాకు మరో అవకాశం ఇవ్వండి. ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటాం. మూడు నెలల గడువు ఇవ్వండి” అని విజ్ఞప్తి చేశారు. ఇందులో ఆరు సమస్యలున్నాయని.. వీటిని పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఇందుకోసం మరో అవకాశం ఇవ్వాలని కోరారు. తొలుత అందుకు న్యాయస్థానం నిరాకరించినప్పటికీ చివరగా ఓ అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement