రక్షణదళాలకు వన్ ర్యాంక్.. వన్ పెన్షన్ (ఓఆర్‌ఓపీ)పై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఓఆర్‌ఓపీ అమలు విధానంలో రాజ్యాంగపరమైన బలహీనత కనిపించడం లేదని పేర్కొంది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. పింఛన్‌లు, కటాఫ్ తేదీలను నియంత్రించే సూత్రాల గురించి ధర్మాసనం మాట్లాడుతూ, ఒకే ర్యాంక్ ఉన్న పింఛనుదారులకు అదే మొత్తంలో పెన్షన్ ఇవ్వాలనే చట్టపరమైన ఆదేశంలేదు. నిర్దిష్ట సిబ్బందికి వర్తించే వివిధ ప్రయోజనాలు మిగిలిన సిబ్బందితో సమానంగా ఉండాల్సిన పనిలేదని పేర్కొంది. కేసు వాస్తవాలకు సూత్రాలను వర్తింపజేస్తూ, జస్టిస్ సూర్యకాంత్, విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. 2015 నవంబర్ 7 నాటి ప్రకటనలో పేర్కొన్నట్లు ఓఆర్‌ఓపీ సూత్రంలో రాజ్యాంగపరమైన బలహీనత మాకు కనిపించలేదని నొక్కిచెప్పింది.
2015 నాటి నోటిఫికేషన్‌ను పిటిషనర్‌లు సవాల్‌చేస్తూ, ఓర్‌ఓపీ సూత్రం అమలులో అదే వ్యవధిలో ఉన్న వ్యక్తులకు ఒక ర్యాంక్ బహుళ పెన్షన్లుగా పేర్కొనబడిందని చెప్పారు. తద్వారా ప్రారంభ నిర్వచనం మార్చబడింది. పెన్షన్ రేట్ల స్వయంచాలక సవరణకు బదులుగా, భవిష్యత్‌లో పెన్షన్ రేట్ల పెంపుదల స్వయంచాలకంగా గత పెన్షనర్లకు బదలీ చేయబడుతుందని వారు వాదించారు. ఈ విచలనం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ప్రకారం ఏకపక్షం.. రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానానికి నివేదించారు. అయితే ధర్మానం వారి వాదనను తోసిపుచ్చింది. ఓర్‌ఓపీ నిర్వచనం ఏకపక్షం కాదని పేర్కొంది. పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా, పింఛనుదారులందరికీ ఇది ఒకేలా వర్తిస్తుందని కోర్టు తెలిపింది. పెన్షన్ లెక్కింపు కోసం మూల వేతనాన్ని నిర్ణయించడానికి మాత్రమే కటాఫ్ తేదీ ఉపయోగపడుతుందని తీర్పు చెప్పింది. 2014 తర్వాత పదవీ విరమణ చేసిన వారికి చివరి వేతనం ఆధారంగా పెన్షన్ లెక్కిస్తారు. 2013లో పదవీ విరమణ చేసిన వారికి సగటు జీతం ఆధారంగా గణింపు ఉంటుందని కోర్టు వివరించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..