Friday, November 22, 2024

YS Sharmila: ఏపీకి ఇచ్చిన ఒక్క హామీ నెర‌వేర్చ‌లేదు.. మోడీపై మండిప‌డ్డ‌ షర్మిల

ఏపీకి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెర‌వేర్చ‌లేని ప్ర‌ధాని మోడీ పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిప‌డ్డారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీలో ధర్నా చేపట్టబోతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఆమె ఏపీ భవన్ వద్ద ధర్నాకు దిగుతున్నారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… ప్రధాని మోడీ, బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీకి పదేళ్లు కాదు కదా… ఒక్క ఏడాది కూడా ప్రత్యేక హోదాను ఇవ్వలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని నిర్మాణం, విశాఖ రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్ట్ అభివృద్ధి, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ నుంచి చైన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్, వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ వంటి ఎన్నో హామీలు ఇచ్చారని షర్మిల గుర్తు చేశారు.

వీటిలో ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేకపోవడం బాధాకరమన్నారు. ఈ హామీల్లో కొన్నింటిని నెరవేర్చినా… ఏపీకి వీళ్లు ఎంతో కొంత చేస్తున్నారని అనుకునేవాళ్లమని చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని షర్మిల మండిపడ్డారు. ఏపీని మోసం చేసిన బీజేపీకి రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు ఎందుకు మద్దతుగా ఉన్నాయని ప్రశ్నించారు. రాష్ట్ర పార్టీలు బీజేపీకి బానిసలుగా మారాయని మండిపడ్డారు.

- Advertisement -

ఈరోజు ఏపీ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నది కేవలం కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. రాష్ట్ర హక్కులను సాధించుకునేంత వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కూడా కలిశామని… రాష్ట్రానికి బీజేపీ చేసిన మోసాలపై వివిధ పార్టీల అధినేతలకు కూడా లేఖలు రాస్తామని షర్మిల చెప్పారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లకు కూడా లేఖలు రాస్తామని తెలిపారు. అంతిమంగా ప్రజాస్వామ్యమే గెలుస్తుందనే ఆశావాదంతో తాము ఉన్నామని చెప్పారు. విభజన హామీలను సాధించేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement