Thursday, November 21, 2024

వన్ నేషన్, వ‌న్ రేషన్, వన్ కమీషన్.. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాల‌ని ఢిల్లీలో ధర్నా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్ల సంఘం జాతీయ కమిటీ ఢిల్లీలో భారీఎత్తున ధర్నా నిర్వహించింది. అఖిల భారత చౌక ధరల దుకాణాల సమాఖ్య ఉపాధ్యక్షులు, ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో వివిధ పార్టీల ఎంపీలు నామా నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, లింగయ్య యాదవ్, ఆర్. కృష్ణయ్యలు హాజరై సంఘీభావం తెలిపారు. రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నాయికోటి రాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా డీలర్లు చాలీచాలని కమీషన్‌తో ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వన్ నేషన్, వన్ రేషన్, వన్ కమీషన్ ఇవ్వాలని కోరారు. దేశవ్యాప్తంగా ఒకే రేషన్ విధానాన్ని అమలు చేయాలని క్వింటా బియ్యానికి 440 రూపాయలు ఇవ్వాలని అన్నారు. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించకుంటే జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు నందయ్య, ఆనంద్ కుమార్, రాష్ట్ర నాయకులు వెంకన్న, నాగరాజు, నిసార్ పాషా ,రాజయ్య, శేషగిరి రావు తదితరులు పాల్గొన్నారు.

డీలర్ల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తా
చౌక ధరల దుకాణదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను లోక్‌సభలో ప్రస్తావించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు తెలంగాణ రేషన్ డీలర్లకు భరోసానిచ్చారు. ధర్నా అనంతరం డీలర్ల సంఘం నాయకులు పార్లమెంట్ వద్దకు వెళ్లి తమ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలంటూ వినతిపత్రం అందజేశారు. చౌక ధరల దుకాణాల్లో నష్టపోయే బియ్యం, గోధుమలు, పంచదార, వంటనూనె, పప్పు ధాన్యాలకు డీలర్లకు నష్టపరిహారం ఇవ్వాలని, ఇందుకు సంబంధించిన బకాయిలను వెంటనే ఇప్పించాలని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement