భగ్గుమన్న విపక్ష ఇండియా కూటమి
బిల్లును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్
జెపిసి పంపాలంటున్న విపక్ష పార్టీలు
బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ
జెపిసికి పంపేందుకు అధికార పక్షం అంగీకారం
లోక్ సభలో డివిజన్ కు పట్టుపట్టిన విపక్షాలు
అంగీకరించిన స్పీకర్ .. ఎలక్ట్రానిల్ ఓటింగ్ ప్ర్రక్రియ ప్రారంభం
జెపిసి కోసం జైకొట్టిన 269 మంది సభ్యులు
వ్యతిరేకగా ఓటేసిన 198 మంది
న్యూఢిల్లీ – దేశంలో ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన బిల్లుల్ని కేంద్రం ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇవాళ జమిలి ఎన్నికలకు సంబంధంచిన రాజ్యాంగ సవరణ బిల్లుల్ని లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, “జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కొత్తది కాదు. 1983 నుంచి ఈ తరహా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ఉంది. దీనివల్ల రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇది వ్యతిరేకం కాదు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదు. స్వీడన్, జర్మనీ వంటి దేశాల్లోనూ జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి. రాజకీయ కోణంలోనే ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి అని అన్నారు. పార్లమెంట్ లో ‘ఒక దేశం, ఒక ఎన్నికల బిల్లు భారత ప్రజాస్వామ్యం ఎన్నికల చైతన్యంతో వృద్ధి చెందుతుందని, తరచుగా జరిగే ఎన్నికల స్ధానంలో మరింత సమర్థవంతమైన వ్యవస్థ తీసుకొస్తుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి చెప్పారు.
దీనిపై విపక్ష ఇండియా కూటమి భగ్గుమంది. వెంటనే బిల్లులు వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. దీనికి హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇస్తూ, ఈ బిల్లును జేపీసీకి పంపడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.. కేబినెట్ సమావేశంలో మోదీ స్వయంగా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని వెల్లడించారు.
ఈ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని విపక్షాలు డిమాండ్ చేశాయి.. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, తమిళనాడు నుంచి డీఎంకే ఎంపీ టిఆర్ బాలు దీనిపై ఘాటుగా స్పందించారు. ఈ బిల్లును జెపిసికి పంపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
డివిజన్ పై ఓటింగ్ …
జెపిసికి పంపే విషయంలో డివిజన్ కోసం విపక్షాలు పట్టు బట్టాయి.. దీనికి లోక్ సభ ఓం బిర్లా అంగీకారం తెలిపారు.. ఆ వెంటనే ఎలక్ట్రానిక్ ఓటింగ్ నిర్వహించారు.. జెపిసికి పంపేందుకు అనుకూలంగా 269 మంది ఓటు వేయగా, వ్యతిరేకంగా 198 మంది సభ్యులు ఓటు వేశారు.
విపక్షాల బిల్లుపై ఏమన్నాయంటే…
“జమిలి బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం. దీన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలి” – కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ
- “రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ఈ బిల్లుతో బిడ్ వేస్తున్నారు. జమిలి ఎన్నికలు నియంతృత్వానికి దారితీస్తాయి” – ఎస్పీ నేత ధర్మేంద్రయాదవ్
“జమిలి ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే. ఇది ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటిది. ప్రస్తుతం మనకు కావాల్సింది జమిలి ఎన్నికలు కాదు.. ఎన్నికల సంస్కరణలు. గతంలో ఎన్ఎజేఏసీ (నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్) బిల్లును కూడా ఇలాగే చర్చ లేకుండా ఆమోదించుకున్నారు. ఆ తర్వాత మౌలిక స్వరూపానికి ఎన్డీఏసీ విరుద్ధమని సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. జమిలి ఎన్నికల చట్టం వస్తే దానికీ అదే పరిస్థితి ఎదురవుతుంది” – టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ
“జమిలి ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం. ఇవి అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తాయి. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తాయి” – మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
- “ఇది రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే. జమిలి ఎన్నికల బిల్లును జేపీసీ పంపాలి. లేదా దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి” – ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియ సూలే
- “ప్రతిపక్షాలకు సంస్కరణలంటే అలర్జీ. అందుకే దీన్ని వ్యతిరేకిస్తోంది. జమిలి బిల్లుకు మేం పూర్తిగా మద్దతిస్తున్నాం” – శివసేన ఎంపీ శ్రీకాంత్ శిందే
బిల్లుకు టిడిపి మద్దతు
మరోవైపు ఎన్డీయే మిత్రపక్షమైన టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జమిలి ఎన్నికల బిల్లుల్ని బేషరతుగా సమర్థిస్తున్నట్లు లోక్ సభలో ప్రకటించారు. చంద్రబాబు విజనరీ లీడర్ అని, వికసిత్ ఆంధ్ర 2047 ప్రణాళిక తెచ్చారని, సహకార సమాఖ్య వ్యవస్థకు మద్దతునిస్తున్నారని పెమ్మసాని తెలిపారు. 2019 లోక్ సభ ఎన్నికలకే 6 వేల కోట్లు ఖర్చయిందని ఈసీ చెప్పిందన్నారు. లా కమిషన్, నీతి ఆయోగ్ రిపోర్టులు సైతం జమిలి ఎన్నికలతో ప్రయోజనం ఉంటుందని చెప్పాయన్నారు. అన్ని పార్టీలు కలిపి ఎన్నికల కోసం లక్ష కోట్లు ఖర్చుపెడుతున్నాయన్నారు. జమిలి జరిగితే ఖర్చు భారీగా తగ్గుతుందన్నారు.