తాండూరు రూరల్ (ప్రభన్యూస్): వికారాబాద్ జిల్లాలో వాగు ఉధృతికి ఒకరు గల్లంతయ్యారు. ఈ ఘటన తాండూరు మండలం సంగెంకలాన్లో ఇవ్వాల (శుక్రవారం) సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన బొక్తంపల్లి పెంటప్ప(48) శుక్రవారం ఉదయం కర్ణాటక రాష్ట్రం షాపూర్ లో బందువుల అంత్యక్రియల కోసం 30తో కలిసి వెళ్లాడు. అంత్యక్రియలు ముగించుకుని ఇవ్వాల సాయంత్రం గ్రామానికి తిరిగి వచ్చారు. అయితే గ్రామ సమీపంలోకి రాగానే భారీ వర్షాల కారణంగా వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో అందరూ అక్కడే ఉన్న ఓ కల్లు దుకాణం వద్ద కూర్చున్నారు.
కొద్ది సేపటి తరువాత పెంటప్ప గ్రామంలోకి వెళ్లేందుకు వాగు దాటే యత్నం చేశాడు. అటు వైపు, ఇటు వైపు ఉన్న గ్రామస్తులు వద్దని వారించినా పెంటప్ప వినకుండా ముందుకు సాగారు. కొద్ది దూరం వెళ్లాక వాగు ఉదృతికి పెంటప్ప కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. పెంటప్ప కొట్టుకుపోయిన వాగు గుండా గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామ సమీపంలోని బండల వాగులో కర్ణాటకు చెందిన చెట్టినాడు సిమెంట్ కర్మాగారం రైల్వే ట్రాక్ కోసం పిల్లర్లు నిర్మించడంతో వాగు ప్రవాహ సమస్యలు ఏర్పడ్డాయని గ్రామస్తులు ఆరోపించారు. వాగులో వరదనీరు ప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడడంతో పెంటప్పు వాగులో కొట్టుకుపోయేందుకు కారణమైందన్నారు. వాగులో కొట్టుకుపోయిన పెంటప్పకు భార్య అమృతమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న కరణ్ కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు.