Saturday, November 23, 2024

వన్ డీలర్-వన్ కమిషన్.. రవాణా, నిర్వహణ నష్టాలపై సుప్రీంలో పిటిషన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అమలవుతున్న ‘వన్ నేషన్ – వన్ రేషన్’ విధానం మాదిరిగా ‘వన్ డీలర్ – వన్ కమిషన్’ విధానాన్ని అమలు చేయాలని జాతీయ రేషన్ డీలర్ల ఫెడరేషన్ డిమాండ్ చేసింది. బుధవారం ఢిల్లీలోని ముక్తధార ఆడిటోరియంలో జరిగిన ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సమావేశంలో రేషన్ డీలర్ల సమస్యలపై చర్చించి, పలు అంశాలపై తీర్మానాలు చేశారు. అనంతరం విడుదల చేసిన ఓ ప్రకటనలో రేషన్ డీలర్లకు ఇచ్చే కమిషనర్ విషయంలో దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన రేట్లు అమలవుతున్నాయని, అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధానం అమలు చేయాలని ఆలిండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ టీఏవీవీఎల్ నరసింహమూర్తి పేర్కొన్నారు. అలాగే సరకు రవాణా సమయంలో, నిర్వహణ సమయంలో తలెత్తే నష్టాలపై న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన మినహాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

ఈ మేరకు తమ ఫెడరేషన్ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని తెలిపారు. తమ డిమాండ్ల సాధనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా రేషన్ డీలర్లు ఆందోళనలు, నిరసనలు చేపట్టేలా కార్యక్రమాలను రూపొందించుకున్నట్టు మూర్తి వెల్లడించారు. ఆ ప్రకారం జూలై 4నుమండల స్థాయిలో, జూలై 11న జిల్లా హెడ్‌క్వార్టర్ స్థాయిలో, జూలై 18న రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధానిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా రేషన్ డీలర్లకు పిలుపునిచ్చారు. చివరగా ఆగస్టు 2న దేశవ్యాప్తంగా ఉన్న 5లక్షలకు పైగా డీలర్లు పాల్గొనేలా న్యూఢిల్లీ వేదికగా పార్లమెంట్ మార్చ్ నిర్వహించాలని జాతీయ కార్యవర్గం తీర్మానం చేసింది. రేషనల్ డీలర్ల ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షులు మండాది వెంకట్రావు ఆలిండియా కమిటీ ప్రధాన కార్యదర్శి విశ్వంభర బసు, ఆలిండియా ఉపాధ్యక్షులు ప్రహ్లాద్ మోడీ (ప్రధాని నరేంద్ర మోదీ సోదరులు) దృష్టికి రాష్ట్రంలోని రేషన్ డీలర్ల సమస్యలు తీసుకెళ్లి, పరిష్కారం కోసం కృషి చేయాల్సిందిగా కోరినట్టు నరసింహమూర్తి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement