హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : హైదరాబాద్ కేంద్రంగా జరుగనున్న వన్డే మ్యాచ్‌కు అభిమానుల నుంచి విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. సోమవారం సాయంత్రానికి ఆన్‌లైన్‌లో 20వేలు, ఆఫ్‌లైన్‌లో 18 వేల టికెట్ల అమ్మకం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉప్పల్ స్టేడియం వేదికగా 18న జరగనున్న ఇండియా – న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ టికెట్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్‌లో పెట్టిన అరగంటలోపే వేలాది టికెట్లు సేల్ అయ్యాయి. ఈ మ్యాచ్ కోసం ఈ నెల 14న, 8వేల టికెట్లు, 15న 12వేల టికెట్లు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తెలిపింది. పేటీఎం ద్వారా కూడా టిక్కెట్ల విక్రయాలు జరుపుతున్నారు. టికెట్స్ విక్రయాలు జరుగుతున్న సమయంలో సైట్ సరిగా పనిచేయడం లేదని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం మరో 12వేల టికెట్ల అమ్మకాలు జరిగాయి. మరోవైపు హెచ్‌సీఏ తీరుపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే, ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకున్నవారికి సోమవారం నుంచి ఫిజికల్ టికెట్స్ ఇవ్వనున్నారు. దీనికోసం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం, ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నట్టు మెసేజ్ చూపించిన వారినే స్టేడియం లోపలికి అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో 8 కౌంటర్లు, 75 మంది పోలీసులు, గచ్చిబౌలి స్టేడియంలో 8 కౌంటర్లు, 80 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశారు. మహిళలు, పురుషుల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ చూపిస్తే.. అది స్కాన్ చేసి పేటీఎం సిబ్బంది ఫిజికల్ టికెట్లను ఇవ్వనున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు మరో 7 వేల టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు హెచ్‌సీఏ వెల్లడించింది. 18న ఉప్పల్ స్టేడియం వేదికగా టీ-ం ఇండియాతో జరగనున్న వన్డే మ్యాచ్ కోసం న్యూజిలాండ్ టీం సోమవారం హైదరాబాద్ చేరుకుంది. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో రెండు టీమ్స్ ప్రాక్టీసు చేయనున్నాయి.