Friday, October 18, 2024

KTR | గ్రాఫిక్స్‌తో మాయ.. మూసీ పేరుతో లక్షన్నర కోట్ల కుంభ‌కోణం !

తెలంగాణ భ‌వ‌న్‌లో మూసీపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఈ సందర్భంగా మూసీపై ముఖ్యమంత్రి రేవంత్ రోజుకో మాట చెబుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజెంటేషన్ పేరుతో సీఎం రేవంత్ దాదాపు రెండున్న‌ర గంట‌ల పాటు తాను ఏదో విజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నాన‌ని అనుకుని తన పరువు తీసుకున్నారని విమర్శించారు.

రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అవాస్తవాలే అని.. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక‌త వ‌స్తున్న క్ర‌మంలో గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారని ఆరోపించారు. మూసీని మురికి కూపంగా మార్చింది గత ప్రభుత్వాలేనని… అవి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలేనని కేటీఆర్ అన్నారు. 70శాతం పారిశ్రామిక వ్యర్థాలు మూసీలోనే కలుస్తున్నాయి.

1908లో వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు మోక్ష‌గుండం విశ్వేశ్వ‌ర‌య్య‌ డిజైన్ చేసిన రిజ‌ర్వాయ‌ర్లు, పార్కులు త‌ప్ప కేసీఆర్ వ‌చ్చేదాకా ఏ ప్ర‌భుత్వం కూడా మూసీ ప్రక్షాళన ప్రయత్నాలు చేయలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు రిపోర్టు తెప్పించుకుని… మూసీ బ్యూటిఫికేషన్ చేయాలనుకున్నాం అని తెలిపారు. మూసీ అభివృద్ది కోసం రూ.16 వేల 634 కోట్లకు డీపీఆర్ సిద్ధం చేశాం. కాంగ్రెస్ లా కాకుండా మూసీ ప్రాజెక్ట్ ను మానవీయ కోణంలో చేపట్టాలనుకున్నాం అని తెలిపారు.

రేవంత్ రెడ్డి చేయని సర్వేను చేసినట్లుగా రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారని, మూసీ పేరుతో లక్షన్నర కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల‌ను అట‌కెక్కించారు.. 420 హామీల‌తో ప్ర‌జ‌ల గొంతు కోశారన్నారు. ఢిల్లీకి పంపే మూటల కోసమే మూసీపై రేవంత్ కు ప్రేమ ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement