దేశంలో మరోసార గోధుమల ధరలు భారీగా పెరుగుతున్నాయి. రానున్న పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు భారీగా నిల్వలు పెంచుకోవడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీంతో గోధులమ ధరలు 6 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. రానున్న ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని కేంద్రం సరఫరాలను పెంచేందుకు చర్యలు తీసుకోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అవసరమైతే దిగుమతి సుంకాలను తగ్గించి, దిగుమతులను ప్రోత్సహించే అవకాశం కూడా ఉందని వీరు అభిప్రాయపడుతున్నారు.
గోధుల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణంపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలకు ఎదురు దెబ్బ తగులుతుందని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గోధులమ ధరలు 1.5 శాతం పెరిగాయని ట్రేడర్స్ తెలిపారు. ఒక మెట్రిక్ టన్నుకు మంగళవారం నాడు 25,446 రూపాయల ధర పలికింది. ఇది ఫిబ్రవరి 10 తరువాత ఇదే అత్యధిక రేటు అని వ్యాపారులు తెలిపారు.
గడిచిన నాలుగు నెలల్లోనే గోధుమల ధరలు 18 శాతం పెరిగాయని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ధరలను అదుపు చేసేందుకు నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ఇలా చేయకుంటే రానున్న పండుగల సీజన్లో కొరత ఏర్పడుతుందని ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారులు అభిప్రాయపడ్డారు. గత సంవత్సరం గోడౌన్లలో 26.6 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమలు ఉంటే, ఈ ఆగస్టు నాటికి ఈ నిల్వలు 28.3 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగాయి.
దిగుమతులు పెంచకుంటే ప్రభుత్వం గోధుమల సరఫరాలను పెంచలేదని ఒక ట్రేడర్ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు గోధుమలపై 40 శాతం ఉన్న దిగుమతి సుంకాలను రద్దు చేయడం, లేదా తగ్గించడం, వ్యాపారులు, మిల్లర్ల వద్ద ఉండే నిల్వల మొత్తంపై పరిమితిని తగ్గించడం వంటి చర్యల గురించి ప్రభుత్వ ఆలోచిస్తోందని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖలోని ఒక సీనియర్ అధికారి తెలిపారు.
కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపిన వివరాల ప్రకారం 2023లో 112.74 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమల ఉత్పత్తి వచ్చిందని అంచనా వేసింది. ఇది గత సంవత్సరం కంటే 107.7 మిలియన్ మెట్రిక్ టన్నులు అధికమని తెలిపింది. దేశీయంగా ఏటా 108 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమల వినియోగం జరుగుతున్నది. వ్యవసాయ శాఖ వేసిన అంచనా కంటే గోధుమల ఉత్పత్తి 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ట్రేడర్స్ వెల్లడించారు.