Saturday, November 23, 2024

ఆర్థిక సంక్షోభంలో మరింత గడ్డు స్థితి.. మరోసారి అండగా భారత్‌.. రెండు షిప్‌ల డీజిల్‌ సరఫరా..

కొలంబో : ఆర్థిక సంక్షోభంలో అత్యంత గడ్డు పరిస్థితికి చేరుకున్నామని, దేశంలో పెట్రోల్‌ నిలలు అడుగంటాయని, మంగళవారంనాటితో ఉన్న నిలలు ఖాళీ అవుతాయని శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే స్పష్టం చేశారు. తాజా పరిస్థితులలో కటువైన, భయంకరమైన నిజాలను ప్రజలకు తెలియజెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నామని, మరో రెండు నెలలపాటు ఇదే పరిస్థితి తప్పదని వెల్లడించారు. మరోవైపు విదేశీ మారక ద్రవ్య నిలలు పూర్తిగా నిండుకున్నాయని చెప్పారు. 2019 నవంబర్‌ నాటికి 7.5 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం నిలలుంటే ఇప్పుడు సున్నాకు చేరుకున్నాయని వెల్లడించారు. సోమవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన దేశం ఎదుర్కొంటున్న తాజా పరిస్థితులను జాతికి చెప్పారు. కాగా అల్లర్లు, నిరసనల మధ్య వాయిదాపడిన పార్లమెంట్‌ సమావేశాలు మంగళవాంనాడు ప్రారంభమైనాయి. మరోవైపు ఇంధన నిల్వలు అడుగంటడంతో విద్యుత్‌ కోతల సమయం మరింత పెరిగనుంది. బుధవారంనుంచి కనీసం రోజుకు 15 గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిపివేసే సూచనలు కన్పిస్తున్నాయి. శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ ప్రైవేటీకరించేందుకు పార్లమెంట్‌ ఆమోదం తెలపాలని, ఈ విషయంలో విదేశాల సహాయాన్ని కోరతామని రణిల్‌ తెలిపారు. భారీ రుణం కోసం ప్రపంచబ్యాంక్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని, తక్షణావసరాలకోసం కనీసం 75 మిలియన్‌ డాలర్ల మొత్తం అవసరమని వెల్లడించారు.

భారత్‌ మరింత సాయం..

ఆర్థిక, ఇంధన, ఆహార కష్టాల్లో చిక్కుకున్న శ్రీలంకకు భారత్‌ పలువిధాలుగా సాయం చేస్తూ వస్తోంది. ఈ వారంలో మరో రెండు షిప్‌మెంట్లలో డీజిల్‌ శ్రీలంకకు చేరనుంది. బుధవారంనాడు ఒక షిప్‌మెంట్‌ కొలంబోకు చేరనుండగా ఈనెల 29న మరో షిప్‌మెంట్‌ చేరుతుంది. మార్చిలో ఆ దేశంలో సంక్షోభం తీవ్రరూపం దాల్చిన తరువాత 2,70,000 మెట్రిక్‌ టన్నుల డీజిల్‌, పెట్రోల్‌ను భారత్‌ సరఫరా చేసింది. ఔషధాలు, ఇంధనం, ఆహారంకోసం 3 బిలియన్‌ డాలర్ల రుణసాయం అందించేందుకు భారత్‌ అంగీకరించింది. అందులో భాగంగా ఇప్పటివరకు 2.5 బిలియన్‌ డాలర్ల సాయాన్ని ఇప్పటికే అందజేసింది. మరో 2 బిలియన్‌ డాలర్ల రుణ బకాయిలను రద్దు చేసింది. ఎగుమతులపై నిషేధం ఉన్నప్పటికీ శ్రీలంకలోని ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని 65 వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను సరఫరా చేసింది. కనీసం 40వేల టన్నుల బియ్యాన్ని అందజేసింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement