హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన హైదరాబాద్ మహానగరం మళ్లీ ‘ఫార్ములా ఈ-రేస్’ వేదిక కానుంది. ఫార్ములా ఈ సిరీస్ 2024 సీజన్‌లో హైదరాబాద్ నగరానికి తిరిగి రానుందని నిర్వాహకులు తాజాగా ప్రకటించారు. దీంతో భారత్‌లో ఈ-రేసు చుట్టూ ఉన్న ఊహాగానాలకు ముగింపు పలికారు. మొన్నటివరకూ తాత్కాలిక ఈ-రేస్ 2024 క్యాలెండర్‌లో హైదరాబాద్ కనిపించకుండా పోయింది.
తాజా నిర్ణయంతో దేశానికి ఆల్-ఎలక్ట్రిక్ సిరీస్ తిరిగి వస్తుందో లేదో అనే క్రీడాభిమానుల సందేహాలకు నివృత్తి కలిగింది. అయితే, ఈ క్యాలెండర్‌లో అరంగేట్రం చేసిన హైదరాబాద్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న రేసును నిర్వహిస్తుందని నిర్వాహకులు ప్రకటించారు. ఫార్ములా ఈ రేస్‌కు మళ్లీ ఆతిథ్యం ఇవ్వడానికి హైదరాబాద్ సిద్ధమైంది.
మెక్సికోలో జనవరి 13న సీజన్-10 కిక్-ఆఫ్ తర్వాత ఫిబ్రవరి 10న హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న ట్రాక్‌లో ఇది జరగనుంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఎక్స్ ట్విట్టర్లో తెలిపారు. ఈ సీజన్‌లో క్రీడా మహోత్సవం యొక్క మెరుగైన సంస్కరణ కోసం సిద్ధంగా ఉండండి.. ఫార్ములా ఈ రేస్‌కు మరోసారి వెల్‌కమ్ అంటూ.. ఆయన పోస్ట్ చేశారు.
తాజాగా శుక్రవారం జరిగిన ఎఫ్‌ఐఏ వరల్డ్ మోటార్ స్పోర్ట్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాత ఎఫ్ బీబీ – ఎఫ్‌ఐఏ ఫార్ములా ఇ-వరల్డ్ ఛాంపియన్‌షిప్ సీజన్ 10లో హైదరాబాద్, షాంఘై ఆతిథ్య నగరాలుగా ఉన్నాయని ఒక అధికారిక పత్రికా ప్రకటన తెలిపింది. ఫార్ములా ఈ వచ్చే ఏడాది మే నెల 25, 26 తేదీలలో షాంఘై ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో డబుల్-హెడర్ రేసులతో షాంఘైలో మొదటిసారి రేస్ చేస్తుంది. మొట్టమొదటి ఫార్ములా ఈ రేసు సెప్టెంబరు 13, 2014న బీజింగ్‌లో జరిగింది.
సాన్యా, హాంకాంగ్‌లు కూడా ఇప్పటి వరకు చైనాలో మొత్తం ఏడు రేసులను నిర్వహించాయి. మార్చి 2019లో చివరిసారిగా రేస్ జరిగింది. ఫార్ములా ఈ ఇప్పటికే సీజన్ 10 క్యాలెండర్‌తో చరిత్ర సృష్టించింది. టోక్యో మార్చి 30న ఒక రేసును నిర్వహించనుంది. మొదటిసారిగా మోటర్‌స్పోర్ట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ రేసు ఐకానిక్ జపాన్ రాజధాని నడిబొడ్డున వీధుల్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
దేశంలో తొలిసారి, రెండోసారి కూడా హైదరాబాద్ ఆతిథ్యం..
ఈ ఏడాది భారతదేశంలోనే మొట్టమొదటి ఫార్ములా ఇ రేస్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. 2023లో హైదరాబాద్ ఇ-ప్రిక్స్ నగరంలోని సుందరమైన హుస్సేన్ సాగర్ లేక్‌లో జరిగింది. మొత్తం 18 మలుపులతో కూడిన 2.8-కిమీ ట్రాక్‌ను హుస్సేన్ సాగర్ సరస్సు పక్కన వాహనాల రాకపోకలకు ప్రస్తుతం ఉన్న రోడ్లను ఉపయోగించారు.
రేసులో మొత్తం 11 టీ-మ్‌లు, 22 మంది డ్రైవర్లు పాల్గొన్నారు. అన్ని కార్లు ఎలక్ట్రిక్ర్, 250కేవీ బ్యాటరీతో నడిచేవి. ఇది 2013లో బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో చివరి ఫార్ములా-1 ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ తర్వాత భారతదేశంలో జరిగిన మొదటి ఎఫ్‌ఐఏ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఈవెంట్‌గా ఎఫ్‌ఐఏ వరల్డ్ మోటార్ స్పోర్ట్ కౌన్సిల్ స్పష్టం చేసింది.