హైదరాబాద్, ఆంధ్రప్రభ : సర్కారు భూముల వేలానికి సన్నాహాలు మొదలయ్యాయి. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశాలకు కొనగోలుదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించడంతో ప్లాట్‌లను ఈ నెల 14 నుంచి ఆన్‌లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ సన్నద్ధమైంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడ, తుర్కయాంజాల్, తొర్రూరులతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని అమిస్తాన్‌పూర్‌లో ప్రభుత్వ స్థలాలను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో గతంలో నిర్వహించిన ఈ-వేలం ద్వారా కొన్ని ప్లాట్‌లను విక్రయించగా మిగిలిన వాటిని రెండో దశలో విక్రయించేందుకు అధికారులు తాజాగా చర్యలు చేపట్టారు.
ఔటర్ రింగ్‌రోడ్డుకు సమీపంలో ఉన్న స్థలాలు కావడం తో సాధారణ, మధ్యతరగతి వర్గాల నుంచి రియల్టర్లు, బడా బిల్డర్ల వరకు కూడా ప్రభుత్వ స్థలాల కొనుగోలు పట్ల ఆసక్తి చూపుతున్నారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే మధ్యతరగతి వర్గాలకు బహదూర్ పల్లి, తొర్రూరులలో 197 చదరపు గజాల నుంచి 267 చదరపు గజాల విస్తీర్ణం వరకు కూడా ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బహదూర్‌పల్లి, తుర్కయాంజల్ కుర్ముల్‌గూడ, తొర్రూరు తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాల కోసం 325 చదరపు గజాల నుంచి గరిష్టంగా 1145 చదరపు గజాల వరకు గరిష్ట విస్తీర్ణంలో కొన్ని ప్లాట్‌లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 14 నుంచి 23 వరకు ప్లాట్‌లను ఈ వేలం నిర్వహించనున్నారు.
ఆదాయమార్గాలకు..
ఆదాయ సముపార్జన కోసం ప్రభుత్వం వివిధ మార్గాలను అణ్వేషిస్తోంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాల విక్రయానికి చర్యలు చేపట్టింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని స్థలాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఈసారి సుమారు రూ.500 కోట్లకుపైగా ఆదాయం లభించే అవకాశం ఉన్నట్లు అంచనా. కుర్మల్‌గూడ, తొర్రూర్‌లలో చదరపు గజానికి రూ.10 వేల చొప్పున కనీస ధర నిర్ణయించగా, తుర్కయాంజల్‌లో కనీస ధర రూ.40వేలుగా నిర్ణయించారు. బహదూర్‌పల్లిలో కనీస ధర రూ. 25 వేల చొప్పున ఉంటుంది. అన్ని చోట్లా ఈసారి భారీ డిమాండ్ ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఒకవైపు భూముల విక్రయం ద్వారా ఆదాయం కోసం చర్యలు తీసుకుంటూనే మరోవైపు గతంలో నిలిచిపోయిన లే అవుట్‌ల క్రమబద్ధీకరణ ద్వారా కూడా ఫీజుల రూపంలో ఖజానా కళకళలాడేట్లు చేసుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని సుమారు 633 వెంచర్‌లను అధికారులు గుర్తించారు. వీటికి ఎల్‌ఆర్‌ఎస్ జారీ చేస్తే మరో రూ.500 కోట్ల వరకు ఫీజుల రూపంలో లభించే అవకాశం ఉందని అంచనాలున్నాయ్.