Sunday, November 24, 2024

Delhi | మరోసారి ఢిల్లీకి ఏపీ రైతులు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అమరావతి రైతులు తమ గోడు వెళ్లబోసుకోవడానికి మరోసారి దేశ రాజధానికి రానున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రమంత్రులు, పలు రాజకీయ పార్టీల నేతలను కలిసేందుకు రైతులు ఢిల్లీ రానున్నట్టు అమరావతి జేఏసీ కన్వీనర్ మాదల శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని ఉద్యమం చేపట్టి వచ్చే ఆదివారానికి 1300 రోజులు పూర్తి చేసుకోబోతోందని చెప్పారు. అమరావతి రాజధాని కేసు ఈనెల 11వ తేదీన సుప్రీంకోర్టు ముందు విచారణకు రాబోతోందని తెలిపారు. అమరావతిపై తమ న్యాయ పోరాటం నడుస్తూనే ఉందని, అమరావతి మాస్టర్ ప్లాన్‌ను ఉద్దేశపూర్వకంగానే మార్చారని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

మాస్టర్ ప్లాన్‌లో చిచ్చు పెట్టేలా కావాలనే అమరావతిలో ఆర్ 5 జోన్ క్రియేట్ చేశారని ఆయన ఆరోపించారు. పేదలకు అమరావతిలో ఇళ్లు ఇచ్చారంటే రాజధాని విశాఖకు మార్చే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి తీరు సమయాన్ని వృథా చేస్తున్నట్టు ఉందని విమర్శించారు. పేదల కోసం ఎన్ని ఇళ్లు కట్టారని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురీ లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వలేదని శ్రీనివాస్ దుయ్యబట్టారు. 120కి పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అమరావతిలో భూమి కేటాయించారని ఆరోపించారు. అమరావతిని ముగింపు లేని అంశంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వాపోయారు. రాజధాని అమరావతా లేక విశాఖపట్నమా అనేది ముందు సీఎం జగన్ చెప్పాలని, ఆ తర్వాత కోర్టులు తేలుస్తాయని శ్రీనివాస్ డిమాండ్ చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement