హైదరాబాద్, ఆంధ్రప్రభ : మరోవైపు మాండౌస్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. మాండౌస్ తుఫాన్‌తోపాటు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో రాగల మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన వాయుగుండం బలహీనపడి సాయంత్రం వాయుగుండంగా మారడంతోపాటు తీవ్ర అల్పపీడనంగా మారిందని పేర్కొంది.
మాండౌస్ తుఫాన్ ప్రభావంతో భాగ్యనగరమంతా ముసురుపట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి మోస్తారు వర్షం కురుస్తోంది. ఆదివారం ఉదయం నుంచి ట్యాంక్ బండ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, బషీర్‌బాగ్, లక్డీకపూల్, నాంపల్లి, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్ తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు, బాటసారులు తడిసిముద్దయ్యారు. నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఆదివారం మోస్తారు వర్షాలు కురిశాయి.