Sunday, November 24, 2024

మార్చి 28న ఏపీ 3 రాజధానుల కేసుపై విచారణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వ్యవహారంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మార్చి 28న విచారణ జరగనుంది. ఫిబ్రవరి 23న ఈ కేసు విచారణ చేపట్టాల్సినప్పటికీ, ఆ రోజు లిస్టులో కేసును చేర్చలేదు. బుధ, గురువారాల్లో ఆఫ్టర్ నోటీస్ కేసులను చేపట్టరాదంటూ ప్రధాన న్యాయమూర్తి సర్క్యులర్ జారీ చేయడంతో కేసు జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. తదుపరి విచారణ ఎప్పుడన్న విషయంపై స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో కేసును ప్రస్తావించింది. త్వరితగతిన విచారణ చేపట్టాలని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనాన్ని కోరింది. ఈ క్రమంలో కేసును మార్చి 28న విచారణ జరిపే కేసులో జాబితాలో చేర్చుతామని ధర్మాసనం తెలిపింది.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పుబడుతూ అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై డిసెంబర్లో విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం, హైకోర్టు ఇచ్చిన తీర్పులోని ఏడు అంశాల్లో 5 అంశాలపై స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలో జనవరి 27న జరిగిన విచారణ సందర్భంగా అమరావతి రైతులు తమకు నోటీసులు అందాయని, కౌంటర్ దాఖలు చేయడానికి కనీసం 2 వారాలు సమయం కావాలని కోరారు. రైతులకు ఆ మేరకు వెసులుబాటు కల్పిస్తూ కేసు విచారణ ఫిబ్రవరి 23కు వాయిదా వేసినప్పటికీ, ఆ రోజు విచారణ జరగలేదు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించడంతో తదుపరి విచారణ తేదీ మార్చి 28గా ఖరారైంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement