న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గురువారం రాత్రి గుండెపోటుతో చనిపోయిన లోక్‌తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్ కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పరామర్శించారు. శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి యాదవ్‌కు ఫోన్ చేసి చంద్రబాబు మాట్లాడినట్టు ఆ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. సుదీర్ఘకాలం పార్లమెంట్ సభ్యులుగా, కేంద్రమంత్రిగా, రైతు నాయకుడిగా చేసిన సేవలను చంద్రబాబు ప్రస్తావించారు. అత్యుత్తమ పార్లమెంటేరియన్ అని ఆయన ప్రసంగాలు ఎంతో స్ఫూర్తిదాయంగా ఉండేవని శరద్ యాదవ్‌తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
దేశం ఒక గొప్ప రైతు నాయకుడిని కోల్పోయిందని ఆయన చెప్పారు. మరోవైపు ఢిల్లీలోని ఛత్తర్‌పూర్ వద్ద ప్రజా సందర్శనార్థం ఉంచిన శరద్ యాదవ్ పార్థీవదేహాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి (జాతీయ వ్యవహారాలు) కంభంపాటి రామమోహన రావు సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కంభంపాటి మాట్లాడుతూ శరద్ యాదవ్‌తో కలిసి రాజ్యసభ సభ్యునిగా పనిచేసినప్పటి అనుభవాలను గుర్తుచేసుకున్నారు.
విలువలతో కూడిన రాజకీయాలకు శరద్ యాదవ్ నిలువెత్తు ప్రతిబింబంగా నిలిచారని కొనియాడారు. రైతులు, పేదలు, బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేశారని అన్నారు. రామ్ మనోహర్ లోహియా బాటలో, జయప్రకాశ్ నారాయణ్ అడుగుజాడల్లో లౌకిక, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుబడ్డ శరద్ యాదవ్ రాజకీయం స్ఫూర్తిదాయకంగా కొనసాగిందని వెల్లడించారు.