విశాఖపట్నం, ప్రభన్యూస్ బ్యూరో : సింహం ఆకారంలో ఉన్న సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణలు చేస్తే తాము కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది అప్పన్న భక్తకోటి ప్రగాడ విశ్వాసం. అంతేకాకుండా సింహగిరిప్రదక్షిణం.. భూ ప్రదక్షిణ ఫలంతో సమానమని, జన్మజన్మల పుణ్యం లభిస్తుందన్నది కూడా పురాణ ఇతిహాస కథనాల కథనం. అందుకు తగ్గట్లుగానే సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతీ ఏటా సింహగిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అయితే కోవిడ్-19 కారణంగా రెండేళ్ల పాటు ఈ ఉత్సవాన్ని నిర్వహించలేదు. తాజాగా ఈ ఏడాది గిరిప్రదక్షిణ ఉత్సవం నిర్వహించేందుకు ఆలయ ఇవో ఎం.వి.సూర్యకళ, ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో అధికార వర్గాలు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించాయి. ఈనెల 12న మధ్యాహ్నం 3 గంటలకు కొండ దిగువున దేవస్థానం బస్‌స్టాండ్ వద్ద పుష్పరథం ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభం కావడం జరుగుతుంది. సింహాచలంలో తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి భక్తులు కాలినడకన తమ గిరిప్రదక్షిణ ప్రారంభిస్తారు.
పాత అడవివరం, కృష్ణాపురం, ముడసర్లోవ, హనుమంతువాక జంక్షన్, జోడుగుళ్లపాలెం వరకు నడిచిన భక్తులు అక్కడ సముద్రంలో పుణ్యస్నానం ఆచరిస్తారు. తిరిగి అక్కడ నుంచి బయలుదేరి ఎంవిపీ, వెంకోజీపాలెం, సీతమ్మధార, మాధవదార, ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం మీదుగా తిరిగి సింహాచలం చేరుకొని (32 కి.మీలు )కొబ్బరికాయ కొట్టి తమ ప్రదక్షిణ ముగిస్తారు. ఈ ఏడాది సుమారు నాలుగు లక్షల మంది భక్తులు గిరిప్రదక్షిణకు హాజరవుతారని అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది. అందుకు తగ్గట్లుగానే జిల్లా కలెక్టర్ఒ ఎ.మల్లిఖార్జున ఆధ్వర్యంలో ఆయా విభాగాల ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు మార్గ మధ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానంతో పాటు స్వచ్చంద సంస్థలు పెద్ద ఎత్తున స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ఇక్కడ భోజనం, పులిహోర, టిఫిన్స్, ప్రసాదాలు, పండ్లు, మందులు, మసాజ్‌లు ఇలా అన్నీ కూడా సమకూరుస్తున్నారు. ఇదే సమయంలో కొండ చుట్టూ నడవలేని భక్తుల కోసం సింహగిరిపైన ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో పాటు మంగళ, బుధవారాల్లో సింహాద్రినాధుడిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున సింహగిరిపైన కూడా దేవస్థానం వర్గాలు భారీ దిశగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.