న్యూఢిల్లీ : ఒమిక్రాన్ వ్యాప్తి పరంగానే కొంత ఆందోళన కలిగిస్తోందని, లక్షణాలతో పాటు ప్రాణ నష్టం అంతగా ఉండదని, అయినా అందరూ జాగ్రత్తగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పష్టం చేశారు. లోక్‌సభలో కొశ్చర్ అవర్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒమిక్రాన్‌పై విపక్షాలు రాజకీయాలు చేయడం మానేయాలన్నారు. ఆక్సిజన్ కొరత ఉందని కొందరు పుకార్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ నిలలు బాగున్నాయని స్పష్టం చేశారు. థర్డ్ వేవ్ వచ్చినా.. ఆక్సిజన్ సంక్షోభం రాదని తెలిపారు.
దీనికి తోడు ఆక్సిజన్ ఉత్పత్తిని భారీగా పెంచామని, ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు. డిమాండ్‌కు తగిన విధంగా ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. అవసరమైన వనరులను ఉపయోగించుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. రెండో వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ ఎంత డిమాండ్ ఉందో నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. ఒమిక్రాన్ బారినపడి వ్యక్తికి ఆక్సిజన్ అవసరం చాలా తక్కువగా ఉంటుందని, అయినా అన్ని ఆస్పత్రుల్లో నిల్వలు సంపూర్ణంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆక్సిజన్ కొరత కారణంగా గతంలో మరణాలు సంభవించాయంటూ విపక్షాలు చేస్తున్న వాదనల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఇప్పుడు మళ్లిd ఆక్సిజన్ కొరత ఉందనే భయాన్ని విపక్షాలు ప్రజల్లో రేకెత్తిస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ఒమిక్రాన్ కట్టడికి అన్ని శాఖలు కలిసి ముందుకు వెళ్తున్నాయని వివరించారు.