కరోనా డెల్టా వేరియంట్‌ని తలదన్నే కొంగొత్త వేరియంట్ వచ్చిపడింది. అది ప్రపంచం నెత్తిమీద కత్తిలా వేలాడుతోంది. గతంలో కొత్త వేరియంట్లను పెద్దగా పట్టించుకోకుండా చివరకు మూల్యాలు చెల్లించిన అనుభవంతో ప్రపంచ దేశాలు అనేకం ఇప్పుడు ఆగమేఘాల మీద కళ్లు తెరిచి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అత్యవసర సమావేశాలు పెట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ప్రపంచ ఆరోగ్య సంస్ధ ముందుగా కీలక సమావేశం జరిపి అప్రమత్తతలు చెప్పింది. భారతదేశ ప్రభుత్వం కూడా అదేరోజు రాష్ట్రాలన్నింటికీ మార్గదర్శకాలు పంపింది. అంతేకాదు. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. అంటే ఆ కొత్త వేరియంట్ యావత్ ప్రపంచాన్ని ఇంతగా భయపెడుతున్నట్టే భావించాలి. అదే సమయంలో ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడిప్పుడే ప్రశాంత జీవనాలకు అలవాటు పడుతున్న తరుణంలో ఈ కొత్త వేరియంట్ వచ్చిపడి మళ్లీ జనజీవితాలను అతలాకుతలం చేయకుండా నివారించాలన్న ఉద్దేశంతో అడుగులు వేస్తున్నాయి.
అందులో భాగంగానే అనేక దేశాలు కరోనా నిబంధనలను విధిస్తున్నాయి. ఇప్పటికే యూరప్ దేశాల్లో ప్రయాణ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అంతేకాదు. ఆఫ్రికన్ దేశాలతో అనేక దేశాలు ప్రయాణ సంబంధాలను తాత్కాలికంగా నిషేధించాయి. చివరకు ప్రపంచస్ధాయిలో స్టాక్ మార్కెట్లు కూడా క్రాష్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఈ వేరియంట్ ఏదో ఒక రకంగా ఆందోళన కలిగించేదిగా ఉందని రూఢి పరిచింది. ఇది ఇప్పట్లో వదిలేట్టు లేదన్న సంకేతాలు కూడా ఇచ్చింది. అందువల్ల దీనికి ఒక స్ధిర నామం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అని పేరు పెట్టింది.
దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్ ఇజ్రాయెల్, బెల్జియం, బోట్స్ వానా, హాంగ్‌కాంగ్‌లలో తన ఉనికిని విస్తరించుకున్నట్టు కనుగొన్నారు. దీన్నిబట్టి ఇది అత్యంత వేగంతో ప్రయాణిస్తున్నదని అర్ధమవుతున్నది. అందువల్ల దేశాల మధ్య రాకపోకల్ని నిషేధించడం ఒక మార్గంగా వివిధ దేశాలు భావిస్తున్నాయి. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ వేరియంట్‌కు వంద రకాల సమానార్ధక జీనోమ్‌లు ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటికే టీకాలు వేయించుకున్నవారిలోనూ ఈ వేరియంట్ కనిపించింది. అంతేకాదు. ఇజ్రాయెల్‌లో థర్డ్ డోస్, బూస్టర్ డోస్ తీసుకున్న వ్యక్తికీ ఇది సంక్రమించింది.