గల్ఫ్ దేశం ఒమన్ ముద్ర తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొమొరోస్ జెండాతో వెళ్తున్న చమురు ఓడ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 16 మంది నౌక సిబ్బంది గల్లంతు అయినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 13 మంది భారత సిబ్బంది, ముగ్గురు శ్రీలంక వాసులు ఉన్నట్లు తెలిపారు. మునిగిపోయిన ఓడను ప్రెస్టీజ్ ఫాల్కాన్‌గా గుర్తించినట్లు చెప్పారు.
పోర్టు టౌన్ దుకమ్‌కు సమీపంలోని రాస్ మద్రాకకు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు ఆ దేశ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ వెల్లడించింది. ఆయిల్ ట్యాంకర్ ముగినిపోవడానికి కారణాలు మాత్రం వెల్లడించలేదు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఓడలో 16 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పింది. ఓడ మునిగిపోయి తలకిందులైందని.. అందువల్ల అందులోని సిబ్బంది గల్లంతయ్యారని వివరించింది. అయితే సముద్రంలో చమురు ఉత్పత్తులు లీకైన విషయాన్ని మాత్రం ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ ఇంకా ధ్రువీకరించలేదు.