ఇప్పటికే 40 మంది క్రీడాకారులకు పాజిటివ్
అలర్ట్ అయిన వైద్య సిబ్బంది
కోవిడ్ నియమాలు పాటించాలని వినతి
ఐసోలేషన్ కు పాజిటివ్ క్రీడాకారులు
క్రీడా గ్రామంలో ఉన్నవారందరికి ఇకపై టెస్టులు
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. పారిస్ ఒలింపిక్స్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రపంచ నలుమూలనుంచి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆటగాళ్లు అస్వస్థతకు గురికావడంతో కోవిడ్ -19 టెస్టులు నిర్వహించారు నిర్వాహకులు. దీంతో దాదాపు 40 మందికి పైగా పాజిటివ్‌గా రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉన్నత స్థాయి అథ్లెట్లు ఈ కోవిడ్-19 బారిన పడ్డట్లు నిర్వాహకులు గుర్తించారు. బ్రిటీష్ స్విమ్మర్ ఆడమ్ పీటీ 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో రజతం గెలిచిన ఒక రోజు తర్వాత కోవిడ్ బారిన పడ్డారు. మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌లో ఆస్ట్రేలియా క్రీడాకారిని లాని పల్లీస్టర్ అనారోగ్యంతో తప్పుకుంది. ఇంకా మరికొందరు అథ్లెట్స్ ఫీల్డ్ లోకి దిగకుండానే స్వదేశానికి పయనమయ్యారు.
అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు..
దీనిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కోవిడ్ -19 వైరస్ ఇప్పటికీ వ్యాప్తి చెందుతోందని, దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోవిడ్-19 వ్యాధికి కారణమయ్యే వైరస్ – SARS-CoV-2 పరీక్షల శాతం పెరుగుతోందని డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ వాన్ కెర్ఖోవ్ తెలిపారు. క్రీడాకారులు, సహాయ సిబ్బంది కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరింది.. ప్రతి ఒక్కరూ విధిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది పారిస్ ఒలింపిక్స్ నిర్వహక కమిటీ..