Tuesday, November 26, 2024

త్వరలో రోడ్ల పైకి ఒలెక్ట్రా హైడ్రోజన్ బస్సులు.. ప్ర‌జా ర‌వాణాలో ఇదో మైలురాయి

హైదరాబాద్ : మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ (OGL) మ‌రో మైలురాయిని సొంతం చేసుకుంది. ప‌ర్యావ‌ర‌ణ‌హిత భవిష్యత్ ప్ర‌జా రవాణా వ్యవస్థను ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేసేందుకు సిద్ధ‌మైంది. రిలయన్స్‌ సంస్థ సాంకేతిక భాగస్వామ్యంతో ఒలెక్ట్రా హైడ్రోజన్ బస్సును రూపొందించింది. కార్బ‌న్ ర‌హిత ప్ర‌జా ర‌వాణా వ‌ల్ల వాతావ‌ర‌ణ కాలుష్యం గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంది. డీజిల్‌, పెట్రోల్‌, సీఎన్జీతో న‌డిచే బ‌స్సుల వ‌ల్ల కాలుష్యం పెరుగుతోంది. దీనికి పూర్తి భిన్నంగా ఒలెక్ట్రా హైడ్రోజ‌న్ బ‌స్సును రూపొందించింది. ఈ బ‌స్సులో ఒకేసారి 400 కిలోమీట‌ర్ల వ‌ర‌కూ ప్ర‌యాణించ‌డానికి వీలుప‌డుతుంది. పెట్రోల్‌, డీజిల్ నిల్వ‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌గ్గిపోతుండ‌టం, వాటి ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతుండ‌టం, వాటి ఉద్గారాల‌తో ప‌ర్యావ‌ర‌ణంపై తీవ్ర ప్ర‌భావం ప‌డ‌టం వంటి భ‌విష్య‌త్ స‌వాళ్ల‌కు అన్నింటికీ హైడ్రోజ‌న్ బ‌స్సు పెద్ద స‌మాధానంగా క‌న‌బ‌డుతోంది.

- Advertisement -

కార్బన్ రహిత హైడ్రోజన్ ర‌వాణా ఆశ‌యాల‌ను సాధించాల‌న్న భారత ప్రభుత్వ ల‌క్ష్య సాధ‌న‌కు ఈ స‌రికొత్త హైడ్రోజ‌న్ బ‌స్సుల త‌యారీ ఎంత‌గానో దోహ‌దం చేస్తుంది. హైడ్రోజన్ బస్సుల ద్వారా మ‌న‌దేశం స్థిరమైన ఇంధన భద్రతను సంత‌రించుకుంటుంది. ఈ హైడ్రోజ‌న్ బ‌స్సు 12 మీట‌ర్ల పొడ‌వు ఉంటుంది. ఈ బ‌స్సులో డ్రైవ‌ర్ సీటు కాకుండా ప్ర‌యాణీకుల‌కోసం 32 నుండి 49 సీట్లు ఏర్పాటు చేశారు. ఒక్కసారి హైడ్రోజన్ నింపితే 400 కి.మీ వరకు బ‌స్సు ప్రయాణిస్తుంది. బ‌స్సులో హైడ్రోజన్ నింప‌డానికి కేవలం 15 నిమిషాల స‌మ‌యం మాత్ర‌మే పడుతుంది. సాంప్ర‌దాయ ఇంధ‌నాల‌తో న‌డిచే బ‌స్సుల్లో ఉద్గారాలు పొగ‌గొట్టం ద్వారా కాలుష్యాన్ని వెద‌జ‌ల్లుతాయి. కానీ ఈ హైడ్రోజ‌న్ బ‌స్సులో టెయిల్‌పైప్ ద్వారా కేవ‌లం నీరు మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇది ప‌ర్యావ‌ర‌ణానికి ఏమాత్రం హానిచేయ‌దు.

ప్ర‌స్తుతం ప్ర‌జా ర‌వాణాలో అత్య‌ధికంగా వినియోగిస్తున్న‌ డీజిల్, పెట్రోల్ వాహ‌నాల‌ను దశలవారీగా తొలగించి, వాటి స్థానంలో ఈ గ్రీన్ బస్సులను తీసుకురావడానికి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ త‌యారుచేసిన హైడ్రోజ‌న్ బ‌స్సు ప‌ర్యావ‌ర‌ణ‌హిత ప్ర‌జా ర‌వాణా చరిత్ర‌లో ఒక మైలురాయిగా చెప్ప‌వ‌చ్చు. ఈ బ‌స్సు సిస్టమ్ విషయానికి వస్తే, బస్సు పైభాగంలో టైప్-4 హైడ్రోజన్ సిలిండర్లను ఏర్పాటు చేస్తారు. ఈ సిలిండర్లు మైన‌స్ 20 నుంచి ప్ల‌స్ 85 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలను తట్టుకొనేలాగా డిజైన్ చేశారు. ఈ బస్సులను ఏడాదిలోగానే వాణిజ్యపరంగా ఉత్ప‌త్తి ప్రారంభించాలని ఒలెక్ట్రా లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి పేరెన్నిక‌గ‌న్న సంస్థ సాంకేతిక స‌హ‌కారం అందించ‌డం శుభ‌ప‌రిణామంగా చెప్ప‌వ‌చ్చు. రానున్న‌కాలంలో భార‌త‌దేశ‌వ్యాప్తంగా ఒలెక్ట్రా హైడ్రోజ‌న్ బ‌స్సులు ప్ర‌జ‌ల‌కు సుఖ‌వంత‌మైన, ప‌ర్యావ‌ర‌ణ‌హిత‌మైన ర‌వాణా అనుభూతిని మిగిల్చేందుకు సిద్ధ‌ప‌డుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement