హైదరాబాద్: ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఒలెక్టా గ్రీన్టెక్ స్టాండ్ఎలోన్ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి రూ.248.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఆదాయం రూ.207.1 కోట్లతో పోలిస్తే 20 శాతం పెరిగింది. డిసెంబరుతో ముగిసి తొమ్మిది నెలలకు ఆదాయం 141శాతం వృద్ధితో రూ.317.3 కోట్ల నుంచి రూ.766 కోట్లకు పెరిగిందని ఒలెక్టా గ్రీన్టెక్ చైర్మన్, ఎండీ కేవీ ప్రదీప్ తెలిపారు. సమీక్షా త్రైమాసికంలో ఆదాయం 20 శాతం పెరగడానికి కారణం 142 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయడమేనని చెప్పారు.
ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.103 బస్సులను సరఫరా చేసింది. డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలలకు నికర లాభం రూ.18.2 కోట్ల నుంచి 136 శాతం వృద్ధితో రూ.42.9 కోట్లకు చేరింది. గత కొద్ది నెలలుగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా అంతరాయాలు ఎదురవుతున్నప్పటికీ.. ఆదాయం స్థిరంగా పెరిగిందని.. రానున్న త్రైమాసికాల్లో చేతిలో ఉన్న ఆర్డర్లను పూర్తి చేయడానికి కృషి చేస్తామని ప్రదీప్ తెలిపారు. మూడో త్రైమాసికం చివరి నాటికి 3,220 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్లు కంపెనీ చేతిలో ఉన్నాయి.