ఆంధ్ర ప్రభ స్మార్ట్ – హైదరాబాద్ : పాతబస్తీ లాల్ దర్వాజా బోనాలు ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నిన్న లాల్ దర్వాజ అమ్మవారికి ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టువస్త్రాలు సమర్పించారు.అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాగా.. ఇవాళ లాల్ దర్వాజా ఆలయంలో రెండో రోజు రంగం భవిష్యవాణి కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటల తరువాత ప్రారంభం కానుంది.
పాతబస్తీ బోనాల పండుగలో అత్యంత ప్రధాన ఘట్టమైన మాతేశ్వరి ఘటాలు పోతరాజుల ఆటపాటలతో సామూహిక ఊరేగింపు ఇవ్వాళ జరగనుంది.
సాయంత్రం నాలుగు గంటలకు హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం వద్ద అంబారీపై మాతేశ్వరి ఊరేగింపు ప్రారంభం కానుంది. ఈ ఊరేగింపు నీ అనుసరించి అన్ని ఆలయాల ఊరేగింపులు సాంస్కృతిక కార్యక్రమాలు, డప్పు, వాయిద్యాలతో నయాపూల్ ఢిల్లీ దర్వాజ వైపు సాగుతాయి. ప్రధాన ఊరేగింపు సాగే దారి పొడవున పెద్ద ఎత్తున విద్యుత్ దీపాలంకరణ చేపట్టారు.
మొత్తం ఊరేగింపు అడుగడుగున పోలీసు బందోబస్తు, నిఘా కెమెరాల నీడలో సాగనుంది. సుమారు 500 కు పైగా పోలీస్ బందోబస్తు, ఆలయంచుట్టు సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. బోనాలు సందర్బంగా ఆలయం వద్ద 5 క్యూ లైన్ లు ఏర్పాటు చేశారు. భక్తులకు రెండు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు.
ఇక.. లాల్‌దర్వాజ బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 100 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచినట్లు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా.. లాల్ దర్వాజ బోనాలు సందర్భంగా 2,500 మంది పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.
పాత బస్తీలోని ఫలక్‌నుమా, చార్మినార్, బహుదూర్‌పురా, మీర్‌చౌక్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇవాల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు సీపీ వెల్లడించారు. అక్కన్న మాదన్న దేవాలయం నుండి నయాపూల్ వరకు ఏనుగుపై ఈ భారీ ర్యాలీ తెల్లవారుజాము నుండి రాత్రి వరకు కొనసాగుతుంది. కాగా.. లాల్ దర్వాజ దేవాలయం, ఎంజీబీఎస్, రెతిఫైల్, జేబీఎస్ వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు… సమాచారం కోసం 9959226154, 9959 226160 నంబర్లలో సంప్రదించవచ్చని వెల్లడించారు.