Saturday, November 23, 2024

7,614 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఓలా.. విద్యుత్‌ కార్లు, బ్యాటరీల తయారీ

ఓలా ఎలక్ట్రికల్‌ భారీ పెట్టుబడి పెట్టనుంది. రానున్న ఐదు సంవత్సరాల్లో కార్ల తయారీ, బ్యాటరీల ఉత్పత్తి కోసం 7,614 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. రాష్ట్రంలో కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్‌ టెక్నాలజీస్‌, ఓలా సెల్‌ టెక్నాలజీస్‌ ఈ పెట్టుబడులు పెట్టనున్నాయి. దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్‌ వాహనాల డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాలని ఓలా నిర్ణయించింది. తమిళనాడులో ఈ పెట్టుబడి వల్ల మూడు వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం, ఓలా ఎలక్ట్రిక్‌ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌, ఓలా సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ పాల్గొన్నారు.

మొత్తం 7,614 కోట్ల రూపాయల పెట్టుబడిలో 5,100 కోట్లు సెల్‌ తయారీ ప్లాంట్‌ కోసం పెట్టనున్నారు. 2,500 కోట్లు విద్యుత్‌ కార్ల తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్లాంట్‌ ద్వారా సంవత్సరానికి 1.4 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తారు.
ఓలా ఈవీ వాహనాలను ముందుగా పొరుగు దేశాలకు ఎగుమతి చేస్తామని తెలిపింది. దీని తరువాత లాటిన్‌ అమెరికా, ఆసియా, ఐరోపా దేశాల మార్కెట్లకు విస్తరిస్తామని గతంలో ఓలా ప్రకటించింది. ఇటీవలే తమిళనాడు కొత్త ఈవీ పాలసీని ప్రకటించింది. మొత్తం దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ వాహనాల్లో తమిళనాడు నుంచే మూడో వంతు ఉత్పత్తి అవుతున్నాయి.

- Advertisement -

రాష్ట్రంలో ఈవీ తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈవీలకు తమిళనాడు ప్రభుత్వం రోడ్‌ ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను రద్దు చేసింది. పర్మిట్‌ ఫీజును కూడా రద్దు చేసింది. ఈ రంగంలోకి 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని తమిళనాడు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా 1.50 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించాలని భావిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్‌ కారును వచ్చే సంవత్సరం మార్కెట్‌లోకి విడుదల చేస్తామని గతంలో సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ తెలిపారు. ప్రస్తుతం ఓలా స్కూటర్లను తయారు చేస్తోంది. త్వరలోనే మోటార్‌ సైకిళ్లను, కార్లను కంపెనీ తయారు చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement