దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్ ఓలా ఎలక్ట్రిక్ దేశియా మార్కెట్లో టూ వీలర్స్ సేల్స్‌లో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ మరో అరుదైన ఘనతను సాధించింది. ఓలా ఎలక్ట్రిక్ తన స్కూటర్ పోర్ట్‌ఫోలియోను 5 స్కూటర్లకు విస్తరించింది. ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల విడుదల చేసిన ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. కేవలం రెండు వారాల్లో 75,000 పైగా బుకింగ్స్ రావడం విశేషం. రెండు వారాల్లోనే 75,000 కంటే ఎక్కువ బుకింగ్స్ రావడంపై ఓలా ప్రతినిధి ఒకరు హర్షం వ్యక్తం చేశారు.
S1 ప్రో, S1 X పోర్ట్‌ఫోలియో, S1 ఎయిర్‌తో ఇకపై ఇంధనంతో నడిచే వాహనాలకు స్వస్తి పలకవచ్చని పేర్కొన్నారు. ఈ ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్‌తో కస్టమర్లు ఇంధనంతో నడిచే స్కూటర్‌తో పోలిస్తే నెలకు రూ.2,600, సంవత్సరానికి రూ.30,000 ఆదా చేయవచ్చని ఓలా ఎలక్ట్రిక్ స్పష్టం చేసింది. అదేవిధంగా, S1 ఎయిర్ వినియోగదారులు సంవత్సరానికి గరిష్ఠంగా నెలకు రూ.1,900, ఏడాదికి రూ.23,000 ఆదా చేయవచ్చని ఓలా పేర్కొంది. S1 ప్రో కస్టమర్లు నెలకు రూ.1,100, ఏడాదికి రూ.13,000 ఆదా చేయవచ్చని తెలిపింది. ఈ సేవింగ్స్‌తో, వినియోగదారులు తమ స్కూటర్ ధరను కేవలం మూడేళ్లలో తిరిగి పొందవచ్చని వివరిస్తోంది.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఓలా ఎలక్ట్రిక్ S1X మోడల్‌ను ఇండియన్ మార్కెట్ లో పరిచయం చేసింది. ఇందులో S1 X+, S1 X (2kWh), S1 X (3kWh) వేరియంట్‌లను ప్రవేశపెట్టింది. S1 X+ (3kWh), S1 X (3kWh) రెండూ శక్తివంతమైన 6kW మోటార్, 3 kWh బ్యాటరీ, 151 కి.మీ రేంజ్, గంటకు 90 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో అందుబాటులోకి రానున్నాయి.
S1 X+ స్కూటర్ రూ.1,09,999 ధరలో అందుబాటులో ఉంది. కాగా స్కూటర్ డెలివరీలు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి. S1 X (3kWh), S1 X (2kWh) ప్రీ-రిజర్వేషన్ రూ. 999 తో కొనసాగుతోంది. వాటి డెలివరీలు డిసెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. S1 X (3kWh), S1 X (2kWh) స్కూటర్లు తక్కువ ధరలో అంటే వరుసగా రూ.99,999, రూ. 89,999 వద్ద అందుబాటులో ఉన్నాయి.