”రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం.. యావత్ ప్రపంచాన్నే ఆర్థిక ఇబ్బందుల్లోకి నెెట్టివేసే పరిస్థితులను సృష్టిస్తోంది. రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య ఏర్పడిన తీవ్ర విభేదాలతో అక్కడి నుంచి ఎగుమతి కావాల్సిన ఆహార, తదితర వాటిపై ప్రభావం పడింది. దీంతో ఉక్రెయిన్ నుంచి భారతదేశానికి దిగుమతి కావాల్సిన వంట నూనెలపై తీవ్ర ప్రభావం పడుతుండగా, ఇది నూనెల ధరల పెంపునకు దారితీస్తోంది. దీంతో మరికొద్ది రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశమున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది”
హైదరాబాద్, ఆంధ్రప్రభ: వంట నూనెల ధరలు ఇప్పటికే మంట మండుతుండగా మరికొద్ది రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతదేశానికి అవసరమైన నూనెల్లో 70శాతానికి పైగా ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణంతో భారత్‌లో నూనెల ధరలు మరింత పెరగనున్నట్టు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. భారత్‌లో వినియోగిస్తున్న నూనెల్లో పామాయిల్ తరువాత సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉండగా ఈ రెండు నూనెలను ఉక్రెయిన్ నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. తాజాగా అక్కడ నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సముద్రమార్గం నుంచి రావాల్సిన ఓడల రవాణాపై ప్రభావం కూడా ధరల పెంపునకు కారణంగా కనిపిస్తోంది. నూనెల దిగుమతుల్లో భారత్, చైనా ముందువరుసలో ఉండగా యూరోపియన్ యూనియన్, పాకిస్థాన్, అమెరికా, బంగ్లాదేశ్‌లు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. పామాయిల్ వినియోగంలో 10.2మిలియన్ మెట్రిక్ టన్నులతో భారతదేశం 2వ స్థానంలో ఉండగా, వంటనూనెల దిగుమతికి ప్రతి ఏటా సుమారు రూ.70 వేల కోట్లు ఖర్చుచేస్తోంది.
సముద్రమార్గంలో సమస్యలు.. లోడు కాని ఓడలు..
ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులతో సుమారు నెల నుంచే నూనెలకు చెందిన ఓడల రవాణాపై ప్రభావం పడింది. తాజాగా ఉక్రెయిన్‌లో ఎమర్జెన్సీ విధించడంతో సముద్రమార్గం ద్వారా రావాల్సిన ఓడలు వస్తాయా లేదా అన్న సందిగ్థత ఏర్పడగా, ఇప్పటికే అక్కడకు వెళ్లిన కొన్ని ఓడలకు సరుకు లోడుకాకపోవడం మరింత ఆందోళనలకు దారితీస్తోంది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి మాసానికి చెందిన కొన్ని ఓడలకు ఇప్పటికే సరుకు లోడు కావాల్సి ఉన్నా.. ఇప్పటివరకు కాలేదని ఆయిల్ కార్పోరేషన్ అధికారి ఒకరు ఆంధ్రప్రభతో అన్నారు.
భయాందోళనలతో ఓడలను పోర్టుకు పంపట్లే..
రెండు దేశాల మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణ ప్రభావం సముద్ర మార్గంపైనే ఉండడంతో సరుకు రవాణా చేసేందుకు రవాణాదారులు భయపడుతున్నారు. దీంతో సరుకును తెచ్చేందుకు అవసరమైన ఓడలను ఆయా పోర్టులకు పంపకపోవడం గమనార్హం. మరోవైపు ఇప్పటికే వెళ్లిన ఓడలైనా వస్తాయా లేదా అన్న అనుమానం వ్యక్తమవుతోంది..
సన్‌ఫ్లవర్, పామాయిల్‌పై ప్రభావం..
యుద్ధం నేపథ్యంలో భారతదేశంలో ప్రధానంగా వినియోగించే పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్స్‌పై ప్రభావం పడనుంది. అన్ని రకాల నూనెలు కలుపుకుని భారతదేశానికి నెలకు సుమారు 10లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. తెలంగాణలో నెలకు 30వేల టన్నులు వినియోగిస్తున్నారు. రోజుకు 2,500టన్నుల నూనెలు అవసరం పడుతున్నాయి. నూనెల దిగుమతికి కేంద్రం సన్ ఫ్లవర్‌కు 5శాతం, పామాయిల్‌కు 7.5శాతం కస్టమ్స్ డ్యూటీని చెల్లిస్తుంది.
కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, మంగళూరు పోర్టుల నుంచి నూనెలను దిగుమతి చేసుకుంటుండగా, కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల నుంచి పామాయిల్‌ను, చెన్నై, మంగళూరు పోర్టుల నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ రాష్ట్రానికి వస్తుంది. అయితే తాజా పరిస్థితులతో పోర్టుల నుంచి నూనెల దిగుమతిపై ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడంతో నూనెల ధరలు మరింత పెరగనున్నట్టు తెలుస్తోంది.
మరో నెల వరకూ పెరగనున్న ధరలు..
యుద్ధ ప్రభావం నిత్యావసరమైన నూనెలపై పడడంతో సామాన్యుడు కొనుగోలు చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో నూనెల ధరలు పైపైకి వెళ్తుండగా మరో నెల రోజుల్లో ఇవి మరింత పెరగనున్నాయి. జనవరిలో లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.134 ఉండగా, నెలలోపే రూ.11 పెరిగి బుధవారం నాటికి రూ.145గా ఉంది. ఇదే క్రమంలో పామాయిల్ కూడా జనవరి 22 రూ.116 ఉండగా ఏకబిగిన రూ.21 పెరిగి ప్రస్తుతం రూ.137గా ఉంది. ఇవి మరింత పెరగనున్నట్టు అధికార వర్గాల నుంచి తెలుస్తుండగా, సామాన్యులు లబోదిబో మంటున్నారు. అయితే ఈ పరిస్థితికి కారణంగా ఉక్రెయిన్ – రష్యాల మధ్య ఏర్పడిన యుద్ధ ప్రభావమని తెలియవస్తోంది.
నెలలోపే రూ.350 పెరిగిన నూనె ధర..
కేవలం నెలరోజుల వ్యవధిలోనే నూనెల ధరలు అమాంతం పెరిగాయి. జనవరి మాసంలో 15లీటర్ల పామాయిల్ ధర రూ.2,020 ఉండగా ఫిబ్రవరి 22 వరకు ఏకబిగిన రూ.350 పెరిగి ప్రస్తుతం రూ.2,370గా ఉంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.2,078 ఉండగా, ఫిబ్రవరి 22 వరకు రూ.162 పెరిగి రూ.2,240కు చేరింది. ఇతర ఆయిల్స్ ధరలు పెరగ్గా, ఇవి మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. నూనెల ధరలను తగ్గించేందుకు కేంద్రం కస్టమ్స్ డ్యూటీని తగ్గించినా ధరలు తగ్గకపోగా నానాటికీ పెరుగుతుండడంతో సామాన్యుడిపై భారం మరింత పెరుగుతోంది. రెండు దేశాల యుద్ధ ప్రభావంతో పరిస్థితులు ఇంకెలా ఉండబోతున్నాయనే దానిపై సర్వత్రా ఆందోళన, ఉత్కంఠ నెలకొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..