Friday, November 22, 2024

Delhi | ఆయిల్‌పామ్ రైతులను ఆదుకోవాలి.. ప్రధాని మోదీకి నామా లేఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో ఆయిల్‌పామ్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వర రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాసిన నామ, ఆయిల్‌పామ్ రైతులను ఆదుకోవడం కోసం క్రూడ్ పామాయిల్ దిగుమతులను నియంత్రిస్తూ దిగుమతి సుంకం పెంచాలని సూచించారు.

తద్వారా విదేశీ పోటీ నుంచి దేశీయ ఆయిల్‌పామ్ రైతులను ఆదుకోవచ్చని అభిప్రాయపడ్డారు. మే 2022 నెలలో టన్నుకు రూ. 23,635 ఉన్న ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ (ఎఫ్ఎఫ్బీ ) ధర అక్టోబర్ 2023 నాటికి రూ. 12,100 కి పడిపోయిందన్నారు. గతంలో 49 శాతంగా ఉన్న  దిగుమతి సుంకాలు ఊహించని విధంగా ఏప్రిల్ 2022 నాటికి సున్నాకి చేరాయని, ఇది రైతులకు భారీ నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -

2017 సంవత్సరంలో ఆయిల్‌పామ్ రైతులు ప్రతి టన్ను ఎఫ్ఎఫ్బికి రూ.13,000 చొప్పున ఆయిల్ పామ్ సాగు ఖర్చును పరిగణనలోకి తీసుకున్నారని, కానీ ఇప్పుడు ఎరువులు , ఇతర ఇన్‌పుట్ ఖర్చులు 100 శాతం కంటే ఎక్కువ పెరిగాయని చెప్పారు. ప్రతి టన్ను ఎఫ్ఎఫ్బి  ఉత్పత్తి వ్యయం రూ. 18,000కి పెరిగిందన్నారు.

ప్రభుత్వం నుంచి మద్దతు లేకపోవడంతో ఆయిల్‌పామ్ రైతులు నష్టపోతున్నారని తెలిపారు. తమ అభ్యంతరాలు, సమస్యలపై సానుకూలంగా స్పందించి, వయబిలిటీ ధరను సవరించడానికి, సాగు ఖర్చును కవర్ చేయడానికి లాభదాయకమైన ధరను ప్రకటించడానికి అన్ని వాటాదారులతో నిర్వహించే  సమావేశానికి పిలవాలని ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రధాన మంత్రిని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement