రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజెల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇప్పటికే ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా పెట్రోల్, డీజెల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా భారత్‌లో మాత్రం ఇంధన ధరలు స్థిరంగానే ఉంటూ వస్తున్నాయి. గత నాలుగు నెలలుగా పెట్రోల్, డీజెల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే, ఎన్నికల అనంతరం ప్రజలపై ఇంధన భారం తప్పేలా లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 110 డాలర్లకు చేరుకుంది. దీంతో భారతీయులపై కూడా పెట్రో భారం తప్పేలా లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ నాలుగు నెలల కాలంలో.. బ్యారెల్ ముడిచమురు ధర దాదాపు 50శాతం పెరిగింది. 70 నుంచి 75 డాలర్ల మధ్య ఉన్నప్పుుడే భారత్‌లో పెట్రోల్ ధరలు మండిపోయాయి. ఇక 110 డాలర్లు దాటిన వేళ ఏ స్థాయిలో పెట్రో వడ్డన ఉండనుందో ఆలోచించలేం..
నాలుగు నెలల్లోనే భారీగా పెంపు..
నాలుగు నెలల క్రితం 70 డాలర్లు ఉన్న క్రూడాయిల్ ఇప్పుడు 110 డాలర్లు క్రాస్ చేసింది. ఈ కాలంలో భారత్‌లో పెట్రో ధర కూడా సుమారు రూ.100 నుంచి రూ.150 పెరిగినట్టుగానే భావించాల్సి ఉంటుంది. అంటే ఏకంగా లీటర్ పెట్రోల్‌పై కనీసం రూ.40 నుంచి రూ.50 పెంచుతుందా.. అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.160 క్రాస్ చేసింది. శ్రీలంకలో లీటర్ పెట్రోల్ రూ.200కు పైగా పలుకుతున్నది. భారత్‌లో కూడా వచ్చే వారం నాటికి ఎన్నికల తంతు ముగుస్తుంది. అందుకే ధరలు పెరిగే అవకాశలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం.. భారతీయ ఆయిల్ కంపెనీలకు మంచి లాభాలే అని చెప్పుకోవాలి.
కొంత భారం మోసే ఆలోచనలో కేంద్రం..
కరోనా మూడో వేవ్‌లో కాలంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజెల్ ధరలను భారీగా పెంచింది. దీంతో సామాన్యులపై భారం తగ్గించేందుకు దీపావళి సమయంలో కొంత సాయం కూడా చేసింది. పెట్రోల్, డీజెల్‌పై సెస్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో మోడీ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజెల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. కేంద్రం అనంతరం వివిధ రాష్ట్రాలు కూడా అదే బాటలో నడిచాయి. ఈ నాలుగు నెలల కాలంలో చమురు ధరలు 70 డాలర్ల నుంచి 110 డాలర్లకు పెరగడంతో.. ధరలు మండిపోవాల్సిందే.. అయితే కేంద్ర ప్రభుత్వం ఇందులో కొంత భారం మోసే అవకాశాలు ఉంటాయనేది ఆర్థిక నిపుణుల అంచనా. మోడీ ప్రభుత్వం రూ.1 నుంచి రూ.3 వరకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అప్పుడు సామాన్యుడిపై భారం కాస్త తగ్గొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరా ఇబ్బందులు, ఉత్పత్తి వంటి అంశాలు ప్రభావం చూపి.. ధరలు పెరుగుతున్నాయి.
2014 తరువాత ఇదే అత్యధికం..
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ మండిపోతున్నది. ముడి చమురు ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ 110 డాలర్లు పలుకుతున్నది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 108 డాలర్లు దాటింది. 2014 నవంబర్ తరువాత క్రూడాయిల్ ధర పెరగడం ఇదే తొలిసారి. మార్చి 1వ తేదీ నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న ముడి చమురు బ్యారెల్ ధర 102 డాలర్లకు చేరుకున్నదని ఇంధన మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు.. ఒక్కో లీటర్‌పై రూ.5 నుంచి రూ.6 వరకు నష్టాన్ని భరిస్తున్నట్టుగా తెలుస్తోంది. కంపెనీ మార్జిన్ చూస్తే.. ఈ నష్టం పెరిగినట్టే.. గతంలో లాగా మార్జిన్ రావాలంటే.. కంపెనీలు ఒక్కో లీటర్‌పై రూ.9 వరకు పెంచవచ్చు అని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. అయితే మోడీ ప్రభుత్వం రూ.1 నుంచి రూ.3వరకు సుంకం తగ్గిస్తే.. అప్పుడే సామాన్యుడిపై భారం రూ.6 వరకు ఉంటుంది. అయితే రిటైల్ ధరల పెంపు వల్లే ఆ ప్రయోజనం సామాన్యుడికి సామాన్యుడికి ఏ మేరకు ఉంటుందనే అంశం కూడా ఉంది.
150 డాలర్లకు చేరే ఛాన్స్..
ప్రపంచ చమురు అవసరాల్లో రష్యా 10శాతం తీరుస్తోంది. రష్యా నుంచి ఐరోపాకు గ్యాస్‌ను సరఫరా చేసే పైప్‌లైన్‌లలో మూడో వంతు ఉక్రెయిన్ నుంచి వెళ్తున్నాయి. రష్యా చమురు సరఫరాలు దెబ్బతింటే.. స్వల్ప కాలంలో చమురు 150 డాలర్లకు చేరినా ఆశ్చర్యం లేదని నిపుణులు చెబుతున్నారు. మాస్కో నుంచి మన పెట్రో దిగుమతుల వాటా 1 శాతం మాత్రమే.. బొగ్గు దిగుమతుల్లో 1.3 శాతం ఉంది. కానీ అంతర్జాతీయ ప్రభావం భారత్‌పై కూడా ఉండే అవకాశం లేకపోలేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..