Saturday, November 23, 2024

భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి కేటీఆర్

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగాన్ని మంత్రి కేటీఆర్ అప్రమత్తం చేశారు. అన్ని శాఖల జిల్లా అధికారులు జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజలు కూడా అనవసరంగా ఇళ్ల నుండి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలపై సమీక్షించారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల పై ఆరా తీశారు. అన్ని శాఖల జిల్లా అధికారులు జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న కారణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. పాఠశాలలకు సెలవు ప్రకటించినందున విద్యార్థులు బయటకి వచ్చే అవకాశం ఉంటుందని చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

మిడ్ మానేరు, అప్పర్ మానేరు, అనంతగిరి ప్రాజెక్టు, మానేరు నది వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు. వేములవాడకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల‌న్నారు. పాఠశాలకు సెలవు ఉన్నందున దైవ దర్శనానికి భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్ అండ్ బీ శాఖ అధికారులు ప్రత్యేకంగా వాగులపై రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జి లు వద్ద అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, విద్యుత్, పోలీస్, ఆరోగ్య శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పూర్తి అప్రమత్తతో ఉండాలన్నారు. తెగిపోయిన విద్యుత్ వైర్లు, నేలకొరిగిన విద్యుత్ స్థంబాలు, ట్రాన్స్ ఫార్మర్ ల వద్ద జాగ్రత్తగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement