Tuesday, November 19, 2024

కొండగట్టు అటవీప్రాంతం అభివృద్ధిపై అధికారుల ఫోకస్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సీఎం కేసీఆర్‌ ఆదేశించడమే ఆలస్యంగా అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి అటవీ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించి యాదాద్రి ఆలయం తరహాలోనే కొండగట్టును తీర్చిదిద్దాలని ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కొండగట్టుకు ఆనుకొని ఉన్న అటవీప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచించారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ తనవంతుగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ తరపున కొండగట్టు కోడిమ్యాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగానే అటవీశాఖ, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ సంయుక్తంగా కొడిమ్యాల అటవీ పునరుద్ధరణ పనులను అధికారులు చేపట్టనున్నారు. కొండగట్టు ఆలయాన్ని ఆనుకొని విస్తారమైన కోడిమ్యాల ప్రాంతంతో కలిపి రెండు అటవీ బ్లాకుల్లో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఈ క్రమంలోనే ఈ ప్రాంత అభివృద్ధికి అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రచించారు. ముందుగా అటవీ ప్రాంతం చుట్టూ అవసరమైన చోట్ల రక్షణ కంచె ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సుమారు 5 కిలోమీటర్ల మేర వాకింగ్‌ ట్రాక్‌ (కాలినడక మార్గం) మట్టితో ఏర్పాటు చేయనున్నారు. అలాగే 1000 ఎకరాల్లో ఔషధ, సుగంధ మొక్కల పెంపకం, అందుకు అవసరమైన నర్సరీల ఏర్పాటు చేయనున్నారు. వాచ్‌టవర్‌ నిర్మాణం, భక్తులు సేద తీరేందుకు వీలుగా సౌకర్యవంతమైన నిర్మాణాలను తొలిదశలో చేపట్టనున్నారు.

భక్తులకే కాకుండా కొండగట్టు ఆలయ పరిసరాల్లో విస్తారంగా సంచరించే కోతుల ఆహారం కోసం అటవీ ప్రాంతంలో పండ్ల మొక్కలను నాటనున్నారు. వీటికి కాసే పండ్లు కోతులు ఆహారంగా తీసుకునేలా చర్యలు చేపడుతున్నారు. ఈక్రమంలో రాష్ట్ర అటవీ-పర్యావరణ, దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆదేశాల మేరకు అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్‌) ఆర్‌ఎం డోబ్రియాల్‌ కొండగట్టులో సోమవారం పర్యటించారు. కొండగట్టు అటవీ ప్రాంతం పునరుద్ధరణ, అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను, సూచనలను అధికారులకు ఆయన ఆదేశించారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. సీఎం ఆదేశాల ప్రకారం రెండు అటవీ బ్లాకుల్లో చేయవలసిన అభివృద్దిపై సిబ్బందికి దిశానిర్దేశం చేసినట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement