సింగపూర్ : రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబును ఒకటి సింగపూర్‌లో పేల్చివేశారు. ఆ ప్రాంతానికి చెందిన ఓ నిర్మాణ స్థలంలో బయటపడిన 100 కేజీల బాంబును ఆ దేశ ఆర్మీ నిపుణులు పేల్చివేశారు. సింగపూర్ లోని బకిట్ టిమా శివారులోని ఓ నిర్మాణ స్థలంలో బాంబు కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆర్మీ సాయం తీసుకొని అది రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటిదని తేల్చారు. బాంబును వేరొక చోటుకు తరలించడం సాధ్యం కాదని గుర్తించి చివరకు దాన్ని అక్కడే పేల్చివేయాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకోసం చుట్టుపక్కల నివాసం ఉంటున్న 4వేల మందిని ఖాళీ చేయించారు.
బాంబు పేలుడు వినిపించే అవకాశం ఉన్నందున ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని ముందే ప్రకటన జారీ చేశారు. బాంబు పేల్చినా ఎలాంటి నష్టం వాటిల్లకుండా సింగపూర్ ఆర్మీ అధికారులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు. సుమారు 40 మంది భద్రతా సిబ్బంది ఇసుక సంచులతో పేలుడు పరికరాన్ని కప్పేశారు. ఆ తరువాత చుట్టూ కాంక్రీటు బ్లాకులను అమర్చారు. ముందుగా నిర్దేశించుకున్న సమయం ప్రకారం బాంబును బ్లాస్ట్ చేశారు. దాంతో భారీ శబ్దం వినిపించింది. పేలుడు తరువాత ఆ ప్రాంతం సురక్షితమని నిర్ధారించుకున్న తరువాతే ప్రజలను తిరిగి తమ ఇళ్లలోకి అనుమతించారు.