వివాదాస్పద ఏవోబీ సరిహద్దుల్లోని కొఠియా గ్రామాల్ని తమవశం చేసుకునేందుకు ఒడిశా రాజకీయ పార్టీలు ఐకమత్యమే ఆయుధంగా ముందుకేగుతున్నాయి. కలిసి వుంటే కలదు సుఖం.. సూత్రంతో ఒడిశాలోని అన్ని రాజకీయ పార్టీలు సమష్టిగా నిర్ణయం తీసుకొని కొఠియా గ్రామాలపై తమదే ఆధిపత్యం అన్న చందంగా ఏపీ పెద్దలకు సవాల్ విసురుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒడిశా ప్రభుత్వం, అక్కడి రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి. విషయాన్ని సీరియస్‌గా పరిగణించి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వ పెద్దలకు చేరవేయాల్సిన విజయనగరం జిల్లా అధికార యంత్రాంగం ఆమేరకు దృష్టి సారిస్తుందో? లేదో? ఎవరికీ అంతు పట్టని నేపథ్యం. దీంతో కొఠియా గ్రామాలు అన్నీ మావే.. కొఠియా గ్రామాలకు అంతా మేమే.. అన్న చందంగా ఒడిశా ప్రభుత్వం పావులు కదుపుతోంది. కొరాపుట్ జిల్లా అధికార యంత్రాంగం కూడా ఆమేరకు ప్రత్యేక దృష్టి సారిస్తూ రోజురోజుకూ పట్టు పెంచుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలను వజ్రాయుధంగా వాడుకొని కొఠియా గ్రామాలను కైవసం చేసుకునేందుకు ఒడిశా ప్రభుత్వం సర్వశక్తులను వడ్డే పనిలో వుందన్నది సుస్పష్టం. పార్టీ కన్నా.. మట్టే మిన్న… నినాదంతో ఒడిశా రాజకీయ పార్టీలు ఏక తాటిపై పయనిస్తున్న వైనం కూడా ఏపీ ప్రభుత్వ పెద్దల్లో చలనం తేలేకపోతోంది. జిల్లా అధికార యంత్రాంగం అయితే ఆ మధ్య కొఠియా గ్రామాలకు చెందిన కొంత మందిని విజయనగరం రప్పించుకొని వారికి భోజన ఏర్పాట్లు చేసి శాలువాలు కప్పి మీరు మావారు అని ఇక్కడే బొట్టు పెట్టేసి చప్పట్లు చరిపించుకున్న పరిస్థితి. అక్కడితో కొఠియా గ్రామాలపై ఏపీ చేయగలిగిందంతా చేసేసినట్లయిపోయింది.
కొఠియా గ్రామాలపై ఏపీ ప్రభుత్వం శ్రద్ధ ఏపాటిదో స్పష్టంగా తెలుసుకున్న ఒడిశా ప్రభుత్వ పెద్దలు, రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలతో శ్రీకారం చుట్టి అంతా మాదే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. కొఠియా జడ్పీటీసీ ఉమ్మడి అభ్యర్థిగా విద్యాధికురాలు మమతా జానిని అక్కడి రాజకీయ పార్టీలు నిలబెట్టిన వైనం తెలిసిందే. ఒకే నామినేషన్ దాఖలవ్వడం వల్ల ఆమె ఎన్నిక ఏకగ్రీవం అన్నది ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. 21 కొఠియా గ్రూపు గ్రామాల అభివృద్ధి, ప్రజల మనసులను గెలుచుకోవడమే వారి సమష్టి వ్యూహమన్న మాట. కొఠియా పగులు చెన్నూరు, కొఠియా నేరెళ్లవలస వయా ఎగువ శంబి గ్రామాలపై ఒడిశా పెద్దలు ఇప్పటికే ప్రత్యేక దృష్టి పెట్టారు. నేరెళ్ల వలసలో తాగు నీటి సమస్య పరిష్కారానికి రెండు బోరు పంపుల ఏర్పాటు ఇప్పటికే జరిగింది. ధూళిభద్రలో సోలార్‌తో వాటర్ పంపిణీకి చర్యలు. అదే తరహాలో మిగిలిన గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితి. ఇప్పటికే రూ.1.50 కోట్లతో కొఠియా గ్రూపు గ్రామాల్లో ప్రధాన గ్రామాలను కలుపుతూ రహదారుల నిర్మాణం, పాఠశాల భవనాల నిర్మాణాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, కొఠియా గ్రామంలో ప్రత్యేక పోలీస్ స్టేషన్, క్వార్టర్స్.. అలాగే ఆస్పత్రి భవనం, వైద్య సిబ్బందికి క్వార్టర్స్, గంజాయిభద్రలో పక్కా ఇళ్లు, దొరలతాడి వలసలో గిరిజన బాలుర వసతి గృహం.. ఇలా కొఠియా గ్రామాలను తమవశం చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి ముందుకేదుతోంది ఒడిశా ప్రభుత్వం. కొఠియా గ్రామాల విషయంలో తామంతా ఒకటేనని బిజూ జనతాదళ్, బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీల నాయకులు బాహాటంగానే చెబుతున్న పరిస్థితి. ఏపీ ప్రభుత్వ నిర్మాణాలను అడ్డుకుంటూ తమ పని కానిచ్చుకొని ముందుకేగుతోంది ఒడిశా ప్రభుత్వం, సంబంధిత జిల్లా అధికార యంత్రాంగం. మొత్తం మీద కొఠియా గ్రామాలు చేజారిపోతున్నాయన్న సంకేతాలు స్పష్టంగా తెలుస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..