Saturday, November 23, 2024

Delhi: ఒడ‌వ‌ని ముచ్చ‌ట‌, పంచాయితీ తీర‌లే.. విభజన సమస్యలు, వివాదాలపై ప్రతిష్టంభన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశం పురోగతి లేకుండానే ముగిసింది. రెండు రాష్ట్రాల మధ్య ఒకట్రెండు అంశాలు మినహా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గతంలో నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగింది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న 7 సమస్యలతోపాటు ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన 7 అంశాలు మొత్తం కలిపి 14 అంశాలతో కేంద్ర హోంశాఖ ఎజెండా రూపొందించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో మంగళవారం జరిగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ తరఫున ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ హాజ‌రయ్యారు.

ఇంకా.. ఆర్థిక శాఖ వ్యవహారాలు చూసే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్. రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు, ప్రేమచంద్రా రెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ్ కుమార్, విద్యుత్ శాఖ కార్యదర్శి విజయానంద్, ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ తరఫున ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఇంధనసాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, సింగరేణి ఎండీ శ్రీధర్, ఆర్ అండ్ బీ శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఉన్నత విద్యాశాఖ నుంచి నవీన్ మిట్టల్ సహా పలువురు అధికారుల బృందం హాజరైంది. ఉదయం గం. 11.00కు సరిగ్గా ఈ భేటీ ప్రారంభమై మధ్యాహ్నం గం. 1.10 వరకు జరిగింది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాల గురించి ఉదయమే ఏపీ భవన్‌లో ఏపీ అధికారుల బృందం భేటీ జరిపింది.

ఉమ్మడి అంశాలు

  1. షెడ్యూల్ 9లోని సంస్థల విభజన:
    ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలున్నాయి. వీటిలో 90 సంస్థల విభజన కోసం షీలా బిడె కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా హోంశాఖ ఏర్పాటు చేసిన సబ్ కమిటీ సిఫార్సులు చేసింది. ఇందులో 53 ప్రభుత్వ రంగ సంస్థల విభజన విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. 15 ప్రభుత్వ రంగ సంస్థల పంపకం విషయంలో కమిటీ సిఫార్సులపై తెలంగాణ సానుకూలంగా ఉన్నా.. ఏపీ వ్యతిరేకించడంతో ఏకాభిప్రాయం కుదరలేదు. అలాగే 22 సంస్థల విషయంలో ఏపీ సానుకూలత వ్యక్తం చేసినప్పటికీ, తెలంగాణ అందుకు ఒప్పుకోలేదు.
  2. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ విభజన:
    2016లో కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వ సూచనను పట్టించుకోలేదని, పైగా పాత బోర్డు సభ్యులు ఏకపక్షంగా విభజన ప్రణాళిక రూపొందించారని ఆరోపించింది. ఇందులో రంగారెడ్డి జిల్లాలో సంస్థకు చెందిన 238 ఎకరాల భూమి వ్యవహారం ప్రస్తుతం హైకోర్టులో ఉంది. హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు అమలవుతున్నాయి. కోర్టులో వివాదానికి త్వరగా పరిష్కారం లభించేలా చూడాలని హోంశాఖ కార్యదర్శి ఆదేశించారు.
  3. షెడ్యూలో 10లోని 142 సంస్థల విభజన:
    ఇందులో తెలుగు అకాడమీ విభజన సహా మరికొన్ని సంస్థల విభజన విషయంలో వివాదాలు కోర్టుల వరకు వెళ్లాయి. వాటి స్థితిగతులు తెలుసుకుని త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలని హోంశాఖ కార్యదర్శి సూచించారు.
  4. సింగరేణి కాలరీస్ – అనుబంధ సంస్థ ఏపీ హెవీ మెషినరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ విభజన:
    సింగరేణి కాలరీస్ సంస్థలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాటా ఇచ్చే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్రం వాదించింది. ఇందులో 51శాతం వాటా పూర్తిగా తెలంగాణకే బదలాయించడం జరిగిందని ఆ రాష్ట్రం తెలిపింది. దీని అనుబంధ సంస్థ ఏపీ హెవీ మెషినరీ ఇంజనీరింగ్ లిమిటెడ్‌లో ఉమ్మడి వాటా ఈక్విటీ పంపకం మాత్రమే జరగాల్సి ఉందని తెలిపింది.
  5. ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌కు క్యాష్ క్రెడిట్‌తో పాటు రైస్ సబ్సిడీ విడుదలపై చర్చ జరిగింది.
  6. చట్టంలో పొందుపర్చని సంస్థల విభజన:
    చట్టంలో పొందుపర్చని 12 సంస్థల గుర్తించారు. వీటి విభజన ఎలా జరపాలన్న అంశంపై కసరత్తు చేయాల్సిందిగా కేంద్ర న్యాయశాఖను హోంశాఖ కార్యదర్శి ఆదేశించారు.
  7. కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఉమ్మడి సంస్థలపై ఖర్చు, ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులపై తెచ్చిన రుణం విషయంలో నగదు, బ్యాంకు బ్యాలెన్స్ పంపకంపై చర్చ జరిగింది. ఈ అంశంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సహాయం తీసుకుని పంపకాలు చేసుకోవాలన్న హోంశాఖ సూచనకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి.

తెలంగాణ ఏం చెప్పింది?
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014కు లోబడి తీసుకునే నిర్ణయాలకు తాము కట్టుబడి ఉంటామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే సమస్యలు సృష్టిస్తోందని ఆరోపించింది. ప్రతి విషయంలోనూ కోర్టు గడప తొక్కుతూ కాలం వృధా చేస్తోందని హోంశాఖ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. విద్యుత్ బకాయిల అంశాన్ని లేవనెత్తేందుకు తెలంగాణ అధికారులు ప్రయత్నించగా, ఎజెండాలో లేని అంశాలపై ఇప్పుడు చర్చ జరపడం కుదరదని కేంద్ర హోంశాఖ చెప్పింది. షెడ్యూల్ IX సంస్థల విషయంలో డాక్టర్ షీలాభిడే కమిటీ సిఫార్సులను పూర్తిస్థాయిలో ఆమోదించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెప్పడంతో.. 2017 మే నెలలో ఇచ్చిన హెడ్‌క్వార్టర్ నిర్వచనం మేరకే వాటిని విభజించాలని తెలంగాణా వాదించింది. ప్రిన్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ ఉన్న చోటే సంస్థ హెడ్క్వార్టర్‌గా పరిగణించాలని కేంద్ర హోంశాఖ 2017లో స్పష్టం చేసింది.

- Advertisement -

జిల్లాల్లో ఉన్న షెడ్యూల్ IX సంస్థల ఆస్తుల పంపకానికి నిబంధనలు ఒప్పుకోవన్న తెలంగాణ తేల్చి చెప్పింది. సెక్షన్ 53 ప్రకారం నిబంధనలకు అనుగుణంగా 68 సంస్థల విభజనకు గతంలోనే ఆమోదం తెలిపామని చెప్పింది. షీలా భిడే కమిటీ చేసిన మిగిలిన 23 సంస్థల విభజన నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ వాదించింది. అలాగే విభజన చట్టంలో లేని 32 సంస్థల విభజన కుదరదని తెలంగాణ తేల్చిచెప్పింది. వాటిని విభజించాలంటే చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని తెలిపింది. పైగా వాటిలో 10 సంస్థలు ఇప్పటికే మూతపడ్డాయని వెల్లడించింది. మిగిలిన వాటిలో కొన్ని మరీ చిన్నవని, ఖాయిలా పడ్డాయని వివరించింది. పునర్విభజన చట్టంలో పొందుపరచని అంశాలను రాష్ట్ర విభజన జరిగిన 3 ఏళ్లలోపే కేంద్రం దృష్టికి తీసుకురావాలని సెక్షన్ 66 లో స్పష్టంగా ఉందని తెలంగాణ ప్రభుత్వం గుర్తుచేసింది.

పునర్విభజన చట్ట ప్రకారం షెడ్యూల్ X సంస్థల విభజన జరిపితే అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. షెడ్యూల్ X సంస్థల విభజన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ అనవసరంగా కోర్టు గడప తొక్కిందని అసహనం వ్యక్తం చేసింది.

ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పింది?
ఉమ్మడి అంశాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాదనలు పరస్పరం భిన్నంగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైన అంశాలు కూడా సమావేశం ఎజెండాలో ఉండడంతో వాటిపై ఏపీ తన వాదన బలంగా వినిపించింది. శివరామకృష్ణ కమిటీ సిఫారసు మేరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రూ. 29 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాలని ఆ రాష్ట్రం కోరింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పిన రూ. 2,500 కోట్లు రాజధాని నిర్మాణానికి అసలేమాత్రం సరిపోవని చెప్పింది. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన రాయితీల గురించి ప్రస్తావించగా, కేంద్ర హోంశాఖ సంబంధిత శాఖకు తగు ఆదేశాలు జారీ చేసింది. అలాగే వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ. 20 వేల కోట్లు గ్రాంట్ ఇవ్వాలని ఏపీ కోరింది.

అమరావతిలో రాపిడ్ రైల్వే కనెక్టివిటీ, హైదరాబాద్ నుంచి అమరావతికి ఎంఎంటీఎస్ లైన్ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తావించగా.. ఈ రెండింటికీ ఫీజిబిలిటీ (సాధ్యాసాధ్యాలు) లేదని కేంద్రం తెలిపింది. ఫిజిబులిటీ లేనందు వల్లే చట్టంలో పొందుపరిచారని, కాబట్టి అమలు చేయాలని ఏపీ అధికారులు వాదించారు. షెడ్యూల్ 9లోని ప్రభుత్వ రంగ సంస్థల విభజనపై షీలా బిడే కమిటీ సిఫారసులను పూర్తిగా అంగీకరిస్తున్నట్టుగా ఏపీ తెలిపింది. ఆ ప్రకారం 89 సంస్థల విభజన చేయాలని కోరింది. అయితే ఏకాభిప్రాయం కుదిరిన 53 సంస్థల్ని విభజన చేయాలని తెలంగాణ చెప్పడంతో మిగిలిన సంస్థల విభజనపై ఉన్న అభ్యంతరాలేంటో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హోంశాఖ కోరింది. షెడ్యూల్ 10లోని సంస్థల విభజనపై న్యాయ సలహా ప్రకారం ముందుకు వెళ్లాలన్న హోంశాఖ సూచనతో ఏపీ ఏకీభవించింది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఏపీ అధికారులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement