విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని ఉవ్విళ్లూరుతున్న వేలాదిమంది విద్యార్థినీవిద్యార్థుల ఆశలపై ఆయా దేశాలు నీళ్లు జల్లుతున్నాయి. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో స్టూడెంట్ వీసాలను వివిధ దేశాలు గణనీయంగా తిరస్కరిస్తున్నాయి. గోల్డ్ మెడలిస్టులు, వివిధ విభాగాల్లో టాపర్ల దరఖాస్తులు కూడా తిరస్కరణకు గురవుతుండటం విశేషం. కరోనాకు ముందు ఉన్న పరిస్థితులతో పోలిస్తే తిరస్కరణకు గురైన స్టూడెంట్ వీసాల సంఖ్య దాదాపు రెండు రెట్లు పెరిగింది. ప్రత్యేకించి కెనడాకు స్టూడెంట్ వీసాలపై వెళ్లాలనుకున్న వేలాదిమంది నిరుత్సాహానికి గురవుతున్నారు. మెరికల్లాంటి విద్యార్థుల వీసాలను కూడా ఆ దేశం తిరస్కరిస్తూండటంతో ఆశావహులు కంగుతింటున్నారు. ఐఈఎల్‌టీఎస్‌లో 6.5 స్కోరు సాధించిన రాధికా పటేల్ అనే కామర్స్ గ్రాడ్యుయేట్ కెనడాలో పీజీ చేయాలనుకున్నారు. తొలిసారి ఆమె స్టూడెంట్ వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైంది. రెండోసారి ఎంతో మంజూరవుతుందని ఎంతో నమ్మకంతో ఉంది. కానీ రెండోసారీ తిరస్కరించడంతో ఆమె నిరుత్సాహానికి గురైంది.
ఆ తరువాత తేరుకున్న ఆమె దేశీయ విద్యాసంస్థల్లో చదువు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. కెనడా యూనివర్శిటీలో చెల్లించిన 17వేల కెనడియన్ డాలర్ల ఫీజు మొత్తాన్ని వెనక్కు ఇవ్వాల్సిందిగా ఆ సంస్థను కోరింది. ఇలా వేలాదిమందికి కెనడానుంచి చేదు అనుభవం ఎదురైంది. కోవిడ్‌కు ముందు కేవలం 15 నుంచి 20 శాతం స్టూడెంట్ వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యేవని, కానీ కోవిడ్ తరువాత హీనపక్షం 40 నుంచి 50 శాతం తిరస్కరిస్తున్నారని స్టూడెంట్ వీసా కన్సల్టెండ్ అనుజ్ పారిఖ్ తెలిపారు. మిగతా దేశాలతో పోలిస్తే కెనడాయే పెద్దసంఖ్యలో స్టూడెంట్ వీసా దరఖాస్తులను తిరస్కరిస్తోందని చెప్పారు. గతంలో వచ్చిన దరఖాస్తుల్లో 85 శాతం ఆమోదం పొందేవని, కానీ ఇప్పుడు 55 శాతం మించి స్టూడెంట్ వీసాల దరఖాస్తులు ఆమోదం పొందడం లేదని మరో కన్సల్టెండ్ భావిన్ ధాకెర్ చెప్పారు. గడచిన రెండు సంవత్సరాలలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఉన్నత విద్యను అభ్యసించేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది.
కోవిడ్ నేపథ్యంలో కఠిన నిబంధనలు విధించి అనుమతులు తగ్గించడంతో అందరి దృష్టి కెనడాపైకి మళ్లింది. అక్కడ స్టూడెంట్ వీసా సులువుగా మంజూరవడం, తక్కువ ఫీజులకే నాణ్యమైన విద్యావకాశాలుండటంతో డిమాండ్ పెరిగింది. దాంతో దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో కెనడా కూడా స్టూడెంట్ వీసాల మంజూరుపై దృష్టి సారించింది. అయితే, ప్రతిభావంతుల దరఖాస్తులు కూడా తిరస్కరణకు గురవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వీసా కన్సల్టెండ్ అంకిత్ మిస్త్రీ ఆందోళన వ్యక్తం చేశారు. పైగా కెనడాకు వీసా మంజూరు సమయం మరీ ఎక్కువగా ఉందని, దాదాపు 9-12నెలల సమయం పడుతోందని, తీరా అంతకాలం వేచి చూసాక తిరస్కరణకు గురైతే విలువైన విద్యాసంవత్సరం కోల్పోవాల్సి వస్తుందని జయదీప్ నక్రానీ అనే మరో కన్సల్టెంట్ అభిప్రాయపడ్డారు.