న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద మురికివాడల పునరాభివృద్ధిలో భాగంగా జరిగిన కాంక్రీటు ఇళ్ల నిర్మాణంలో కేవలం 3.52 శాతం ఇళ్ళ కేటాయింపులే జరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకంలోని ఇతర అంశాలతో పోలిస్తే మరికివాడల పునరాభివృద్ధి ఎందుకు వెనుకబడిందని సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీనికి మంత్రి కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి జవాబిస్తూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ పథకంలో నాలుగు విభాగాల కింద పేదలకు గృహ నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ నాలుగు విభాగాలు వాటి డిమాండ్‌కు అనుగుణంగానే ముందుకు సాగుతున్నాయని తెలిపారు.
ఇందులో బీఎల్సీ విభాగంలో కొత్తగా పెళ్లైన దంపతులు సొంత ఇల్లు కావాలనుకుంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి గృహ నిర్మాణ ప్రక్రియ మొదలవుతుంది. ఈ విభాగం మాత్రం చురుగ్గా ముందుకు సాగుతోందని, అందుకు కారణం అది అత్యంత సరళతరమైనది కావడమేనని మంత్రి వెల్లడించారు. సొంత ఇల్లు కావాలనుకునే యువ దంపతులు ముందుగా ఒక ఇంటిని గుర్తించి దాని కొనుగోలుకు బ్యాంక్ రుణం పొందాలని సూచించారు. ఈ రుణంలో ప్రభుత్వం రాయితీ ఇస్తుందని మంత్రి చెప్పారు. ఇక మురికివాడల పునరుద్ధరణ విభాగంలో అక్కడ భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు నిర్వాసితులను తాత్కాలికంగా వేరే చోటికి తరలించాల్సి ఉంటుందని, మురికివాడల పునరుద్ధరణకు ఇదే పెద్ద అవరోధంగా మారిందని చెప్పారు. మురికివాడల పునరుద్ధరణ కింద ఇప్పటికే దేశంలో ఇప్పటికే 210 క్లస్టర్లను గుర్తించామని తెలిపారు.