Tuesday, November 19, 2024

PM MODI: ఇన్నేళ్లు ఓబీసీల‌ను వదిలేశారు…రాజ్యసభలో కాంగ్రెస్‌పై ప్రధాని నిప్పులు…

కాంగ్రెస్ పని అయిపోయింది. కాంగ్రెస్ ఆలోచనలన్నీ అవుట్ డేటెడ్. దేశాన్ని ముక్కలు చేయటానికి ప్రయత్నిస్తోంది, విభజించి పాలించటం కాంగ్రెస్ పార్టీకి అలవాటే, ఎంత అల్లరి చేసినా తన గొంతు మూగబోదని ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో విరుచుకు పడ్డారు. పెద్దల సభ నుంచి నిష్క్రమిస్తున్న 56 మంది సభ్యులకు వీడ్కోలు పలికారు.

కేంద్ర బడ్జెట్ పై రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. రాజ్యసభలో అలజడి సృష్టించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చివర దశలో ఉందని, తమకున్న నలబై స్థానాలను కాపాడుకునేందుకు తపిస్తోందన్నారు. ఇప్పటికే కనీసం నలబై సీట్లు కూడా రావని పశ్చిమ బెంగాల్ నాయకులు స్పష్టం చేశారని మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో అయిదు ఆర్థికాంశాల్లో బలహీన పడిందన్నారు. గడచిన పదేళ్లల్లో ఈ అయిదు ఆర్థికాంశాల్లో అగ్రస్థానానికి చేరుకున్నామని, ఇందుకు ఎంతో కష్టపడ్డామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ని మాటలు మాట్లాడుతోంది, ఓబీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ప్రకటించలేదు, జనరల్ కేటగిరిలో ఏ ఒక్క నిరుపేదకు రిజర్వేషన్ కల్పించారా? అక్కడి వరకూ దేనికి బాబా సాహెబ్ అంబేద్కర్​కు భారత రత్న ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతారా? అని ప్రధాని మోడీ ప్రశ్నించారు.

- Advertisement -

ప్రజాస్వామ్యంగా ప్రజలు ఎన్నుకున్న ఎన్నో ప్రభుత్వాలను కూల్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజాస్వామ్యం, సమాఖ్యతపై లెక్చర్లు దంచుతోందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. దేశ రక్షణ కోసం ఉగ్రవాదాన్ని తుదముట్టించాం, కాశ్మీర్లో శాంతిని నెలకొల్పాం, కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉత్తర, దక్షిణ భారతాలుగా విభజించటానికి ప్రయత్నిస్తోందని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 ఏళ్లుగా ఓబీసీల హక్కులను పట్టించుకోలేదని, ఓబీసీలను అణచివేసిందని, తనను ప్రశ్నించేందుకు కాంగ్రెస్ నాయకులకే గ్యారంటీ లేదన్నారు.

“భారత దేశ సంస్కృతిలో ఏ గొప్పదనమూ లేదేమో అని ప్రజలంతా ఆత్మన్యూనతతో ఉండిపోయేలా చేసింది కాంగ్రెస్. మేడ్ ఇన్ ఫారిన్ అనేది అప్పట్లో ఓ స్టేటస్ సింబల్‌గా మార్చేసింది. ఈ కాంగ్రెస్ వాళ్లు ఎప్పుడూ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ గురించి మాట్లాడలేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో నాలుగు కీలక విషయాలు చెప్పారు. యువత, మహిళ, నిరుపేదలు, రైతుల గురించి ప్రస్తావించారు. వాళ్లందరి సమస్యల్ని పరిష్కరించగలిగే మార్గాలున్నాయి అంటూ ప్రధాని మోదీ ప్రసంగించారు.

నెహ్రూ పాలన నుంచి యూపీఏ అధికారం కోల్పోయేంత వరకూ దేశాన్ని సర్వనాశనం చేశారంటూ మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీని స్థాపించిందే బ్రిటీష్ వాళ్లని విమర్శించారు. యూపీఏ పాలనలో దేశం వెనకబడిపోయిందని అన్నారు. అప్పటి ప్రధాని అన్ని రకాల రిజర్వేషన్‌లనూ వ్యతిరేకించారని,దీనిపై ముఖ్యమంత్రులకు నెహ్రూ రాసిన లేఖలు రికార్డుల్లో ఉన్నాయని తేల్చి చెప్పారు. రాజ్యాంగకర్త అంబేడ్కర్‌కి భారత రత్న ఇచ్చేందుకు కాంగ్రెస్‌కి మనసొప్పలేదని, తమ కుటుంబ సభ్యులకు మాత్రం భారతరత్న ఇచ్చుకున్నారని మండి పడ్డారు. ఇప్పటికీ కాంగ్రెస్‌ నెహ్రూనే గుడ్డిగా అనుసరిస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదని అసహనం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు కల్పిస్తే ప్రభుత్వ స్థాయి పడిపోతుందని నెహ్రూ అనేవారని గుర్తు చేశారు. ఇలాంటి వైఖరి ఉన్న కాంగ్రెస్‌ని ఎవరూ మార్చలేరని మండి పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement