కేవలం విద్యుత్తు, గాలితోనే ఆహారం సృష్టి
ప్రొటీన్‌ను తయారుచేసిన ఫిన్‌లాండ్ కంపెనీ
ఇందులో మనుషులకు అవసరమయ్యే అన్ని పోషకాలు
ఆహార కొరతకు ఇదే పరిష్కారం అంటున్న స్టార్టప్ సంస్థ
ఎడారులు, మంచు ప్రదేశాల్లోనూ ఈజీగా తయారు చేసుకోవచ్చు
సూక్ష్మజీవిని పెంచి ప్రొటీన్ పౌడర్ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచంలో పెరిగిపోతున్న ఆహార కొరతకు సరికొత్త పరిష్కారాన్ని సోలార్ ఫుడ్స్ అనే ఓ ఫిన్‌లాండ్‌కు చెందిన స్టార్టప్ సంస్థ కనుగొన్నది. ఈ కంపెనీ ‘సొలీన్’ అనే ఒక ప్రొటీన్ పౌడర్‌ను తయారు చేసింది. ఈ పౌడర్‌ను మనుషులు ఆహారంగా తీసుకోవచ్చని కంపెనీ చెప్తోంది. ఈ ప్రొటీన్ పౌడర్‌ను గాలి, విద్యుత్తును ఉపయోగించి తయారుచేయడం విశేషం. ఫిన్‌లాండ్‌లోని నేషనల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలతో కలిసి ఈ కొత్త ఆహారాన్ని కనుగొన్నట్టు సోలార్ ఫుడ్స్ సీఈవో డాక్టర్ పసి వైనిక్కా తెలిపారు. హైడ్రోజెన్ (హెచ్2), కార్బన్ డయాక్సైడ్ ద్వారా పెరిగే ఒక రకమైన సూక్ష్మజీవితో ఈ ప్రొటీన్ పౌడర్‌ను తయారుచేసినట్టు చెప్పారు. విద్యుత్తు ద్వారా హెచ్2, గాలి ద్వారా కార్బన్ డయాక్సైడ్ అందించి ట్యాంకుల్లో ఈ సూక్ష్మజీవిని పునరుత్పత్తి చేసిన్నట్టు తెలిపారు.
మనుషులకు కావాల్సిన విటమిన్లు..
ఈ సూక్ష్మజీవినే ఎండబెట్టి పౌడర్ చేస్తామని, పసుపు రంగులో ఉండే ఈ ప్రొటీన్ పౌడర్‌లో మానవ శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్లు, అమినో యాసిడ్లు ఉంటాయని ఆ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఎండిన మాంసంలో ఉండే పోషకాలే దాదాపుగా ఇందులో కూడా ఉంటాయని తెలిపారు. పర్యావరణ మార్పుల వల్ల ప్రభావితమవుతున్న సంప్రదాయ ఆహార ఉత్పత్తి పద్ధతులకు ఈ కొత్త ప్రక్రియ ప్రత్యామ్నాయంగా మారుతుందని ఈ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ఎడారులు, మంచు ప్రదేశాలు సహా ఎలాంటి కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనైనా ఈ పౌడర్‌ను తయారుచేయవచ్చని తెలిపింది. మొక్కల ద్వారా చేసే ఆహార ఉత్పత్తితో పోలిస్తే కేవలం ఒక్క శాతం నీటితో, ఐదు శాతం భూవిస్తీర్ణంలో సొలీన్ ప్రొటీన్‌ను తయారుచేయవచ్చని ప్రకటించింది.