కామారెడ్డి : కామారెడ్డి కలెక్టరేట్ నుంచి వర్చువల్ మోడ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా జరగిన ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ – ఇంద్రకరణ్ రెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్ – బాల్క సుమన్, ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం – పువ్వాడ అజయ్ కుమార్, ములుగు – సత్యవతి రాథోడ్, జయశంకర్ భూపాలపల్లి – ఎర్రబెల్లి దయాకర్ రావు, వికారాబాద్ – సబిత ఇంద్రారెడ్డి, నాగర్ కర్నూల్ – శ్రీనివాస్ గౌడ్, గద్వాల్ – నిరంజన్ రెడ్డి, ఆయా జిల్లాల నుంచి పాల్గొని ప్రసంగించారు. అనంతరం గర్భిణుల వద్దకు వెళ్ళి కిట్స్ పంపిణీ చేశారు. ఇదే వేడుకగా ఏఎన్ఎంలకు చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంబించారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. బిడ్డ కడుపులో పడ్డప్పుడు న్యూట్రీషన్ కిట్.. డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్ మరో అద్భుతమైన పథకానికి రూపకల్పన చేశారు. న్యూట్రిషన్ కిట్స్ గర్భిణులకు వరంగా మారనున్నాయి. 9 జిల్లాల్లో కిట్స్ పథకం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు అన్నారు. మావి న్యూట్రిషన్ పాలిటిక్స్.. వారివి పార్టిషన్ పాలిటిక్స్ అని మండిపడ్డారు. ప్రజా కోణంలో ఆలోచించి సీఎం పథకాలు ప్రారంభిస్తాం, మాతా శిశు సంరక్షణకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్ కిట్ సూపర్ హిట్ అయింది. ఇదే స్ఫూర్తితో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లకు రూపకల్పన చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో పుట్టిన కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ పథకాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఇదొక చారిత్రక ఘట్టం. ఎక్కువగా ఎనీమియా (రక్త హీనత) ప్రభావంతో ఉన్న గర్బిణుల సంఖ్య 9 జిల్లాల్లో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఇందులో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ ఉన్నాయి. మొత్తం1.25 లక్షల మంది గర్బిణులకు రెండు ఏఎన్సీల్లో మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీని కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నది. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, ఐరన్ లను పోషకాహారం ద్వారా అందించి రక్త హీనత తగ్గించడం, హీమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రీషన్ కిట్ల లక్ష్యం అన్నారు.
ఇందులో భాగంగా ఒక్కో కిట్ దాదాపు 2 వేలతో రూపొందించి, కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్సీ చెకప్ సమయంలో ఒకసారి, 28-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్సీ చెకప్ సమయంలో రెండో సారి ఈ కిట్లను ఇవ్వడం జరుగుతుంది. 9 జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం ఈ పంపిణీ చేస్తున్నది.
న్యూట్రీషన్ కిట్లలో ఉండేవి…
1, కిలో న్యూట్రీషన్ మిక్స్ పౌడర్
2, కిలో ఖర్జూర
3, ఐరన్ సిరప్ 3 బాటిల్స్
4, 500 గ్రాముల నెయ్యి
5, ఆల్బెండజోల్ టాబ్లెట్
6, కప్పు
7, ప్లాస్టిక్ బాస్కెట్