Tuesday, November 26, 2024

AP | సీమ జిల్లాల్లో పెరిగిన ఓటర్లు.. కోటి 30 లక్షలు దాటిన సంఖ్య

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్‌ బ్యూరో) : ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం రాయలసీమ ప్రాంతంలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అధికారిక సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉన్న 8 జిల్లాల పరిధుల్లో ఓటర్ల సంఖ్య కోటీ 30 లక్షలు దాటింది. కొత్తగా 13.39 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా వివిధ అంశాల కింద 4 లక్షలకు పైగా ఓటర్లను అధికారులు జాబితా నుంచి తొలగించారు. కొత్తగా నమోదు చేసుకున్న వారిలో 50 శాతం పైగా యువ ఓటర్లు ఉండడం చెప్పుకోదగిన విశేషం.

రాష్ట్రంలో మరో రెండు మూడునెలల్లో జరగనున్న సాధారణ ఎన్నికల కోసం గత ఏడాదిగా కసరత్తు చేస్తున్న ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను సోమవారం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 జిల్లాల్లో ఓటర్ల సంఖ్య 4 కోట్లను అధిగమించగా రాయలసీమ ప్రాంతానికి చెందిన 8 జిల్లాల్లో ఓటర్ల సంఖ్య ఒక కోటి 31 లక్షలను దాటింది. ఎప్పటిలాగే పురుష ఓటర్ల సంఖ్య కన్నా మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కవగా కనిపిస్తోంది.

తాజా జాబితా ప్రకారం 13.39 లక్షల మంది కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మరోవైపు మరణించిన, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన, మరో ప్రాంతంలో ఓటు- కలిగివున్న మొదలైన కారణాలతో 4 లక్షల మంది పేర్లను జాబితా నుంచి అధికారులు తొలగించారు. ఇక ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడానికి 4 జిల్లాలు 8 జిల్లాలు కావడం మౌలిక కారణం అయితే అందుబాటులో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ప్రచారం చేయడం, ఉన్నత విద్యాసంస్థలలో నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా అధికారులు చేసిన ఏర్పాట్లు ఫలించాయని చెప్పవచ్చు.

రాజకీయపరమైన కారణాలతో ఓట్లను తొలగిస్తున్నారనే ప్రచారం కూడా గతంలో కన్నా భిన్నంగా తమ ఓటు జాబితాలో ఉందో లేదో తెలుసుకుని, లేకపోతే బిఎల్‌ఓల ద్వారా నమోదు చేసుకోవడం కనిపించింది. సాంకేతిక విజ్ఞానం కూడా ఇందులో కీలక పాత్ర పోషించింది. అందుకే అధికారిక సమాచారం ప్రకారం 2004, 2014 ఎన్నికల తరువాత యువత ఎక్కువగా ఈసారి ఓట్లను నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయిన తరువాత ఇప్పటి రాష్ట్రంలో 2014, 2019 సంవత్సరాలలో జరిగిన ఎన్నికల ఓటర్ల సంఖ్యతో పోల్చిచూసినప్పుడు పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది.

2014 ఎన్నికలలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓటర్ల సంఖ్య 30.88 లక్షలు కాగా ఆ సంఖ్య 2019 ఎన్నికలలో 31.72 లక్షలకు పెరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఓటర్ల సంఖ్య 2014 ఎన్నికల నాటికి 30.15 లక్షలు 2019 ఎన్నికలకు 32.39 లక్షలకు పెరిగింది. ఉమ్మడి కడప జిల్లాలో ఓటర్ల సంఖ్య 2014 ఎన్నికల నాటికి 21.69 లక్షలు కాగా 2019 ఎన్నికలలో ఆ సంఖ్య 22.04 లక్షలకు చేరింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా విషయానికి వస్తే 2014 ఎన్నికల నాటికి 31.62 లక్షలుగా ఉన్న ఓటర్ల సంఖ్య 2019 ఎన్నికల నాటికి స్వల్పంగా పెరిగి 31.83 లక్షలకు పరిమితం అయింది.

- Advertisement -

ఆ విధంగా రాయలసీమ పరిధిలోని 4 జిల్లాల్లో 2014 ఎన్నికల నాటికి కోటి 14 లక్షల పైగా ఉన్న ఓటర్ల సంఖ్య 2019 ఎన్నికలకు కోటి 17 లక్షలు దాటింది. ఇక సోమవారం ప్రకటించిన తుది జాబితా ప్రకారం కర్నూలు జిల్లాలో 29.16 లక్షలు , నంద్యాల జిల్లాలో 13.74 లక్షలు, వై ఎస్సార్‌ కడప జిల్లాలో 16.18 లక్షలు, అన్నమయ్య జిల్లాలో 14.04 లక్షలు, అనంతపురం జిల్లాలో 19.96 లక్షలు, సత్యసాయి జిల్లాలో 13.92 లక్షలు, తిరుపతి జిల్లాలో 17.79 లక్షలు, చిత్తూరు జిల్లాలో 15.58 లక్షలు చొప్పున 8 జిల్లాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య ఒక కోటీ 31 లక్షలు దాటింది.

చివరగా 2019లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే మొత్తం మీద రాయలసీమ ఓటర్ల సంఖ్యలో 13.39 లక్షల ఓటర్ల పెరుగుదల కనిపిస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఓటర్ల సంఖ్య కనిపిస్తున్నా రాయలసీమ పరిధిలో వై ఎస్సార్‌ కడప జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం మీద కొత్త రాజకీయ సమీకరణలు, ఎక్కువగా కొత్త అభ్యర్థుల రంగప్రవేశాలతో జరగనున్న ఎన్నికలలో కొత్తగా జాబితాలో చేరినవారిలో 50 శాతం పైగా నమోదు చేసుకున్న యువత, ప్రభావం కీలకం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement