యాపిల్ కంపెనీకి సరఫరాలు చేసే ఫిన్‌లాండ్‌కు చెందిన సాలాకాంప్ సంస్థ ఇండియాలో త న ఉద్యోగుల సంఖ్యను వచ్చే మూడేళ్లలో 25వేలకు పెంచనున్నట్లు తెలిపింది. 2025 నాటికి కంపెనీ వార్షిక అదాయం 2-3 బిలియన్ డాలర్లు ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. కోవిడ్‌తో పాటు, అమెరికా, చైనా మధ్య పెరుగుతున ఉద్రిక్తతల మూలంగా సప్లయ్ చైన్‌లో తరచుగా అవంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో చైనా బయట యాపిల్ ఉత్పత్తులు ముఖ్యంగా యాపిల్ ఐఫోన్ తయారీని పెంచాలని కంపెనీ నిర్ణయంచింది. మొత్తం సప్లయ్ చైన్ ప్రత్యామ్నాయం కోసం చూస్తోందని, ఈ దిశగా భారత్ ఉత్తమ ప్రత్యామ్నాయాలలో ఒకటిగా ఉందని సాల్‌కాంప్ మాన్యూఫ్యాక్చరింగ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శశికుమార్ గెంధమ్ తెలిపారు.
చైనాపైనే ప్రపంచం ఆధారపడిందని, ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయం చూడాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన తెలిపారు. కాలిఫోర్నియాకు చెందిన క్యూపర్టినో 2017లో ఐఫోన్ అసెంబ్లింగ్ ప్రారంభించింది. దీని తరువాత విస్ట్రోన్, ఫాక్స్‌కాన్ కూడా అసెంబ్లింగ్ చేస్తున్నాయి. యాపిల్ సప్లయ్ చైన్‌లో సాల్‌కాంప్ కీలక పాత్ర పోషిస్తుందని శశికుమార్ చెప్పారు. సాల్‌కాంప్ చెన్నయ్ ప్లాంట్‌లో ప్రస్తుతం 12 వేల మంది పని చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ శాతం ఛార్జర్లను, స్మార్ట్ ఫోన్ విడిభాగాలను తయారు చేస్తోంది. ఈ ప్లాంట్‌ను నోకియా నుంచి కంపెనీ కొనుగోలు చేసి 2020 నుంచి కార్యకలాపాలను ప్రారంభించింది. వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో కంపెనీ ఉద్యోగుల సంఖ్యను 25 వేలకు పెంచాలని నిర్ణయించినట్లు శశికుమార్ తెలిపారు.
2025 నాటికి కంపెనీ బిజినెస్ 2 నుంచి 3 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కంపెనీ ఆదాయం 40 బిలియన్ రూపాయలుగా ఉంది. వచ్చే రెండు సంవత్సరాల్లో ఇండియాలోని ఫాక్స్‌కాన్ కూడా ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. చైనా బయట ప్రస్తుతం ఐఫోన్ల తయారీ 5 శాతంగా ఉంది. ప్రస్తుతం ఇండియాలో ఐఫోన్ల తయారీ 5-7 శాతంగా ఉంది. దీన్ని 25 శాతానికి పెంచాలని ఐఫోన్ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.