గత నెల 25న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైన 8వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను మరుసటి రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు అర్ధాంతరంగా మూసేశారు. తాజాగా కొవిడ్ నిబంధనలను సడలించడంతో ఎగ్జిబిషన్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి ఏడాది నిర్వహించే నుమాయిష్ ను నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ నెల అధికారికంగా పున:ప్రారంభించేందుకు సొసైటీ పాలకవర్గం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందగానే నుమాయిష్ ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటిస్తామని సొసైటీ వెల్లడించింది. కాగా, ఈనెల 25 నుంచే నుమాయిష్ మళ్లీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది.
పదిహేను వందలకు పైగా స్టాళ్లు..
ఈ సారి నుమాయిష్‌లో భారీగా స్టాళ్లను ఏర్పాటు చేసేలా పాలకవర్గం నిర్ణ యం తీసుకుంది. రేండేళ్లుగా పరిస్థితులు అనుకూలించక సరైన అమ్మకాలు లేవు. గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఈ సారి ఎవరూ నష్టపోకుండా ప్రత్యేక ప్రణాళికతో స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. పదిహేను వందలకు పైగా స్టాళ్లతో కొనసాగించేందుకు మైదానంలో ఏర్పాట్లు చేశారు. కొవిడ్ కారణంగా మూసేసినా స్టాళ్లను అలాగే ఉంచారు. అయితే కరోనా ఎప్పుడు తగ్గుతుందో… నుమాయిష్ ఎప్పుడు ప్రారంభమవుతుందోనని ఆందోళనకు గురైన స్టాళ్ల నిర్వాహకులు దాదాపు 30 శాతం మంది తమ డబ్బులను తిరిగి తీసుకొని వెళ్లిపోయారు.
మిగిలిన 70 శాతం స్టాళ్ల నిర్వాహకులు నుమాయిష్ ఎప్పుడు ప్రారంభిస్తే అప్పుడు వ్యాపారాలు నిర్వహిస్తామని.. ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకోకుండా వెళ్లిపోయారు. దీంతో సొసైటీ పాలకవర్గం మైదానంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల నిర్వాహకులకు ఎగ్జిబిషన్‌ను తిరిగి ప్రారంభిస్తామనితమ వస్తువులను తెచ్చుకోవచ్చని ఆహ్వానాలుఫోన్ మెసేజ్‌లను పంపుతున్నారు. మరోవైపు గతంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఘటనతో ప్రస్తుతం అనేక జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై పాలకవర్గం ప్రత్యేక కసరత్తు కూడా చేసింది. దీంతో ఈ ఏడాది మరింత సరుక్షితంగా నుమాయిష్ నిర్వహించేలా పాలకవర్గం ప్రణాళికబద్దంగా వ్యవహరిస్తుంది. అయితే అధికారికంగా వెల్లడిస్తే, స్టాళ్ల నిర్వహకులు తమ ఏర్పాట్లను చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..