టిఆర్ ఎస్ పార్టీ స్థాపించి 20సంవత్సరాలు అయిన సందర్భంగా భారీ సభని నిర్వహించాలని ప్లాన్ వేసింది. ఈ సభకి విజయగర్జన సభ అనే పేరును పెట్టింది. ఈ మేరకు వరంగల్ లో ఏర్పాట్లని ప్రారంభించారు. స్థల పరిశీలనకోసం పలువురు మంత్రులు వెతుకులాట ప్రారంభించారు. 10లక్షల జనంతో సభని భారీగా నిర్వహించాలని సన్నాహాలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే అనూహ్యంగా విజయగర్జన సభను వాయిదా వేసింది టిఆర్ ఎస్. ఈ నెల 15న నిర్వహించాల్సిన ఈ సభను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. నవంబర్ 15 న జరపాలని తలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను తెలంగాణ ధీక్షా దివస్ అయిన నవంబర్ 29 వ తేదీన నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని తీసుకున్నారు.
వరంగల్ ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ నేతలు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ధర్మారెడ్డి తదితర పార్టీ ముఖ్యనేతలు వరంగల్ సమావేశంలో ముక్త కంఠంతో చేసిన అభ్యర్థన మేరకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని వినికిడి..నాటి ఉద్యమ రథసారథిగా తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అనే నినాదంతో సిఎం కెసిఆర్ ప్రారంభించిన ధీక్షా దివస్’ నవంబర్ 29 తేదీయే తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహణకు తగిన సందర్భమని నేతలు తమ అభిప్రాయాలను కేసిఆర్ కు విన్నవించారు.
దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను, తెలంగాణ సాధన కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి స్వరాష్ట్ర సాధనకు మూలమైన ధీక్షా దివస్ రోజే జరపాలని వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కెసిఆర్.. తెలంగాణ విజయ గర్జన సభను నవంబర్ 29 వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు.ఈ నేపథ్యంలో చారిత్రాత్మక తెలంగాణ విజయ గర్జన సభను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేయడానికి ఇప్పటికే కమిటీలు వేసుకోని ముమ్మరంగా కృషిచేస్తూ ఏర్పాట్లల్లో నిమగ్నమైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల టిఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని గమనించాలని సిఎం తెలిపారు. ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లను, బస్సులు తదితర రవాణా వ్యవస్థలను ఈ నెల 29 వ తేదీకి మార్చుకోవాలని సిఎం సూచించారు. తేదీ మార్పు విషయాన్ని క్షేత్రస్థాయి కార్యకర్తలకు తెలియచేయాలన్నారు.